ప్రజాశక్తి- పిఎం.పాలెం : మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల జీవితాలు నాశనం కావడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను తీవ్ర మనవేదనకు గురి చేసినవారవుతారని విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ అన్నారు. పిఎం.పాలెం వి.కన్వెన్షన్ సెంటర్‌లో విశాఖ సిటీ పోలీసుల అధ్వర్యాన డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. మత్తు పదార్థాలను కొన్నా, అమ్మినా సెక్షన్ 20 ప్రకారం రూ.10వేల జరిమానా పడుతుందన్నారు. డ్రగ్స్ రహిత అంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఉన్న సమాచారం తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రచారం చేస్తున్న పోస్టర్లలో ఉన్న ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
డిసిపి-1 విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ, గంజాయి పట్టుకున్న ప్రతి సందర్భంలోనూ లోతుగా పరిశీలిస్తే వాటి వినియోగంలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారని తెలిపారు. ఒక కేసులో ముగ్గురిని పట్టుకుని విచారిస్తే పెద్ద పెద్ద కళాశాలలో చదువుకునే 60మంది వివరాలు లభించాయని చెప్పారు. గంజాయి మత్తుకు అమ్మాయిలు కూడా బానిసలుగా మారుతున్నారని తెలిపారు. మత్తుకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవద్దని హితవుపలికారు. ఆంధ్రా యూనివర్సిటీ సైకాలజీ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ ఎంవి.రాజు మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, దానిని అధిగమించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని తెలిపారు. గాయత్రి విద్యా పరిషత్ కార్యదర్శి ఆచార్య సోమరాజు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఎడిక్షన్ కౌన్సిలర్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్మన్ ఉమరాజ్, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ కెవి.రామిరెడ్డి మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.










