- జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం: మత్తు పదార్థాలను అరికట్టేందుకు పటిష్ట నిఘా అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్డి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. అధికారుల సమిష్టి కృషితో జిల్లాలో మత్తు పదార్థాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. మత్తు పదార్థాల నివారణపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు చిన్న టాబ్లెట్ రూపంలోనూ వచ్చాయని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగం గతంలో కొందరిలో మాత్రమే ఉండేదని, ప్రస్తుతం యువత కూడా బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీస్, వైద్యారోగ్య, ఎక్సైజ్ శాఖలు, విద్యాసంస్థలు, కళాశాలలు, పాఠశాలల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నివారించవచ్చన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణలో అధికారులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల్లో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని, ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.కవిత, జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకీష్న, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు డి.వి విద్యాసాగర్, ఎం.కిరణ్ కుమార్, జెడ్‌పి, సెట్‌శ్రీ సిఇఒలు ఆర్.వెంకట్రామన్, బి.వి ప్రసాదరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ జి.జయదేవి, జిల్లా బిసి సంక్షేమాధికారి ఇ.అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.










