Sep 12,2023 20:32

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న జాయింట్‌ కమిషనర్‌ నాగలక్ష్మి

రాయచోటి : విద్యార్థులందరు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ కమిషనర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో శాఖ విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కొకైన్‌ హెరాయిన్‌, గుట్కా, పొగాకు, ఆల్కాహాల్‌ వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనారోగ్యానికి గురై బరువు తగ్గడం, ఆందోళనకు గురికావడం, ఏకాగ్రత కోల్పోవడం, ఆకలి మందగించడం, వంటి దుష్ప్రభావాలకు గురి అవుతారని వివరించారు. మత్తు పదార్థాలకు బానిసైన వారి కేంద్ర నాడీ మండల వ్యవస్థ అదుపుతప్పి అనారోగ్యానికి గురై ఆర్థికంగా, మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురై కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతారని వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజంలో మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యాసంస్థల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మత్తుపదార్థాల వినియోగం వల్ల రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో తీసుకునే ప్రమాదకర నిర్ణయాలు యువత భవిష్యత్‌ ప్రమాదకరంగా మారుతుందని వివరించారు. స్నేహితులు, బాంధవ్యాలను మరిచి కుంగిపోయి ఆత్మహత్యలకు దారితీస్తుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మత్తు పదార్థాలు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ సూపరిండెండెంట్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ సూపరిండెంట్‌ రవి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ధీరజ్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి. బాలాజీ, వివిధ విభాగాధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి కరుణాకర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.