Feb 02,2023 22:52

ప్రజాశక్తి-కంచికచర్ల 

కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని ఎంవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డ్రగ్స్‌ వాడకం వల్ల జరిగే అనర్ధాలు పై గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నందిగామ రూరల్‌ సీఐ ఐవి నాగేంద్ర కుమార్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ 'డ్రగ్స్‌ రహిత సమాజం , యువత మేలుకో భవితను మలుచుకో డ్రగ్స్‌ ను వదులుకో' అనే నినాదం పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . నేటి యువత మత్తు పదార్థాలకు ఇట్టే ఆకర్షితులై బంగారు లాంటి తమ జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాలలో తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత సరదాగా మొదలై ఆ తర్వాత బానిసై మత్తు పదార్థాలు వాడకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడి చదువుని నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని అన్నారు. యువత డ్రగ్స్‌ పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోదించాలన్నారు. కంచికచర్ల ఎస్సై సుబ్రహ్మణ్యం, విద్యార్థులు పాల్గొన్నారు.