
పీలేరు : విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సమాజానికి ఉపయోగపడే ఓ శక్తిగా ఎదుగుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నమయ్య జిల్లా ఎస్‌పి కృష్ణారావు తెలిపారు. మంగళవారం పీలేరు అర్బన్ సిఐ మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఎంజెఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేర్వేరుగా ఎస్పీ ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాలు, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన దారులు సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని, ప్రమాదాలు నివారించడం మనచేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ నుంచి సౌండ్ రప్పిస్తూ డైవింగ్ చేయడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మద్యం, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని, రెప్పపాటులో జరిగే ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాయచోటి డిఎస్‌పి మహబూబ్ బాష, అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు బోధిషా వలి మాట్లాడుతూ మనం చేసే తప్పు వల్ల మన కుటుంబంతో పాటు ఎదుటి వారి కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుందని, మాదకద్రవ్యాలకు బలవ్వకుండా, హెల్మెట్ కూడా ధరించి వాహనాలను నడపాలని సూచించారు. కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాష, పీలేరు సిఐ మోహన్ రెడ్డి, ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి, అధ్యాపకులు, అన్నమయ్యజిల్లా వ్యవసాయ సలహాదార్లు బొదేషా వలి, సిఎన్‌ఆర్ కళాశాల కరెస్పాండెంట్ విజరు భాస్కరరెడ్డి, రేవూరి సుధీర్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.