నూజివీడు డిఎస్‌పి అశోక్‌కుమార్
ప్రజాశక్తి - నూజివీడు రూరల్
ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నూజివీడు డిఎస్‌పి అశోక్‌కుమార్‌గౌడ్ చెప్పారు. నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నూజివీడులోని వాగ్దేవి జూనియర్ కళాశాల నుంచి ఆర్‌టిసి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిఎస్‌పి అశోక్‌కుమార్‌గౌడ్ మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచార ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తును ఆశించే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించుకుని వాటి వల్ల నష్టాన్ని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవజీవన్ బాల భవన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నూజివీడు టౌన్ సిఐ మూర్తి మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుంచే వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నూజివీడు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిఐ టి.గోపాలకృష్ణ మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ ఎన్‌డిపిఎస్ చట్టం మాదకద్రవ్యాల నేరాలను చాలా తీవ్రంగా చూస్తుందన్నారు. జరిమానాలు కఠినంగా ఉంటాయని చెప్పారు. నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గొల్లమూడి శేఖర్‌బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విజయవాడ, ఏలూరు, పరిసర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి జూని యర్ కళాశాల ప్రిన్సిపల్ పి.కుమార్, నూజివీడు పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్‌ఇబి వారు, నవజీవన్ బాల భవన్ కో-ఆర్డినేటర్స్ బి.రవి, జె.ఆంజనేయులు, బి.రమేష్, కె.ప్రియాంక, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.










