ప్రజాశక్తి - ఆదోని
మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డీఎస్పీలకు సూచించారు. బుధవారం సబ్ కలెక్టర్ ఛాంబర్‌లో 'మత్తు పదార్థాల నియంత్రణపై' ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి, ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారాముడుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వాటికి అలవాటైన వారిని కుటుంబ డాక్టరు విధానం ద్వారా ఇంటింటికీ వైద్యం అందించే వైద్య సిబ్బంది గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయం అందజేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ప్రయివేట్ వాహనాల ద్వారా మత్తు పదార్థాల రవాణా జరిగే అవకాశం ఉంటుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సులలో పార్శిల్ సర్వీసుల ద్వారా రవాణా చేసే వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించి అన్ని పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల్లో మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలను సూచిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. మత్తు పదార్థాల రవాణాకు సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి సీజ్ చేయాలన్నారు. ఎక్కువ శాతం ఇతర ప్రాంతాల నుంచి భవన నిర్మాణ పనులకు వచ్చే వారే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, వారికి కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. పోలీసులు కూడా గ్రామాల్లో పల్లెనిద్రకు వెళ్లినప్పుడు గ్రామస్తులకు అవగాహన కల్పించాలని చెప్పారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్కువ శాతం యువత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని సమాచారం ఉందన్నారు. వారిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ షాపుల్లో కూడా మత్తుకు సంబంధించిన మందులు ఇచ్చే సమయంలో సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. వైట్‌నర్స్ వల్ల కూడా ఎక్కువ శాతం యువత మత్తుకు బానిసలవుతున్నారని తెలిపారు. వైట్‌నర్స్ అమ్మే స్టేషనరీ షాపుల్లో ఎంత మేరకు వైట్‌నర్స్ కొన్నారు, ఎంత మేరకు అమ్మకాలు జరిగాయి, తదితర వివరాలను పరిశీలించేందుకు డివిజన్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపిడిఒలు స్టేషనరీ షాపుల యజమానుల నుంచి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలన్నారు.
సబ్ కలెక్టర్‌తో సమావేశమైన డీఎస్పీలు










