ప్రజాశక్తి-కాకినాడ మహిళలు, బాలికపై హింస అరికట్టాలని మద్యం, మత్తు పదార్థాలు, గంజాయిని నిషేధించాలని ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక సుందరయ్య భవనంలో ఐక్య వేదిక కన్వీనర్ సిహెచ్.రమణి అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మద్యం మత్తు పదార్థాలు గంజాయిలను నిషేధించాలని కార్యాచరణ చేపట్టారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలో రెండు రోజులు జీపు జాతా నిర్వహించి, కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యము తీసుకురావాలని, స్కూల్స్, కాలేజీల్లో సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పిల్లలకు, మహిళలకు రక్షణ చర్యలు చేపట్టే వరకు, మద్యం, మత్తు పదార్థాలు, గంజాయిలను అరికట్టేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిఐ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, జమాతే జిల్లా ప్రెసిడెంట్ ఇబ్రహీం, అహ్మద్, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, శ్రామిక మహిళా సంఘం నాయకులు సిహెచ్.పద్మ, సిద్ధిక, గౌషియా, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.వరలక్ష్మి, ఐలు నాయకురాలు కె.నాగజ్యోతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సూరిబాబు, దినేష్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎ.సింహాచలం, ఐద్వా టౌన్ ప్రెసిడెంట్ జి.భూలక్ష్మి, బి.గంగాభవాని, పద్మావతి పాల్గొన్నారు.










