
- ఫ్రంట్‌లు అప్పుడే కుదరవని ఏచూరి వంటివారు చెప్పినప్పుడు హడావుడి పడిందీ, దాని నాయకత్వంపై ఊహాగానాలకు తెర లేపింది మమతా బెనర్జీ, కెసిఆర్ వంటి నాయకులే. ఎవరి ఉద్దేశాలు ఏమైనా ఎవరి వ్యూహాలు ఎలా వున్నా కార్పొరేట్-మతతత్వ రాజకీయాలను ఓడించి తీరాలి. వైసిపి మరోసారి బిజెపికి దగ్గర కావడమే కనిపిస్తుంది. టిడిపి కూడా కేంద్రం తప్పుల గురించి వివక్ష గురించి పెదవి మెడపడం లేదు. 'సిపిఎం, వామపక్షాలు బిజెపిని ఒంటరిపాటు చేయాలి. ఓడించాలి' అన్న అంశం పైనే తప్పక కేంద్రీకరించి పోరాడతాయి.
బిజెపి మతతత్వ రాజకీయాలు, మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలకు వ్యతిరేకంగా పోరాటం, ఎన్నికల్లోనూ ఒంటరిని చేసి ఓడించడం లౌకిక ప్రజాస్వామిక పక్షాల ముందు కీలక కర్తవ్యంగా వుంది. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీల ఊగిసలాటలూ, లొంగుబాట్లు, ప్రధాన జాతీయ పార్టీగా కాంగ్రెస్ క్షీణత తరచూ ప్రతిబంధకాలు అవుతున్నాయి. సిపిఐఎం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్న ఈ పరిస్థితిని ప్రతిబింబించే మరిన్ని కీలక పరిణామాలు ఈ వారంలో చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు, ఎ.పి, ఒరిస్సా ముఖ్యమంత్రుల సంకేతాలు, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పిల్లి మొగ్గలు, వ్యక్తిగత విన్యాసాలు ఇందుకు ఉదాహరణలుగా వున్నాయి. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా చేసి భారత దేశమంతటినీ అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తాజాగా జరిగిన తమ పార్టీ 21వ వ్యవస్థాపక ప్లీనరీ సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందిస్తానన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా సమస్త వనరులు యువశక్తి గల ఈ దేశం ప్రాథమిక సదుపాయాల విషయంలోనే కునారిల్లి పోతున్నదని, వీటిని సరిచేసే బదులు మతతత్వ రాజకీయాలు నిరంకుశత్వ పోకడలకు పాల్పడుతున్న కేంద్రం వైఖరితో దేశం దారి తప్పి పోతున్నదని మోడీ సర్కారుపై విమర్శలు సంధించారు. అయితే కమ్యూనిస్టు నాయకులు తనను కలుసుకున్నప్పుడు మోడీని గద్దెదించడం కోసం కలసి పని చేద్దామని ప్రతిపాదించారని, అది చెత్త ఎజెండా అందుకోసమైతే మీతో రానని చెప్పానని ఆయన ప్రవచించారు. మొత్తం విమర్శ మోడీ విధానాలపై చేసిన కెసిఆర్‌కు ఆ మోడీని ఓడించడం చెత్త ఎజెండాగా ఎందుకు మారినట్టు? మోడీని గద్దె దించకుండా మోడీత్వను ఓడించడం సాధ్యమా? అనేది ప్రాథమికమైన ప్రశ్న.
గత జనవరిలో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం హైదరాబాదులో జరిగింది. బిజెపిని ఓడించేందుకుగాను ఆయా రాష్ట్రాల రాజకీయ పొందికను బట్టి సరైన వ్యూహాన్ని నిర్ణయించుకోనున్నట్టు ఈసందర్భంగా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న నేపథ్యం గమనంలో వుంచుకొని అడుగులు వేస్తామన్నారు. నిరంకుశ మతతత్వ విధానాలు, విశృంఖల కార్పొరేటీకరణ, ప్రజా వ్యతిరేక పోకడలు, రాష్ట్రాలపై దాడులకు ప్రతిరూపంగా మారిన బిజెపిని ఓడిస్తేనే దేశానికి రక్ష అని సిపిఎం భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో కేరళలో జయప్రదంగా ముగిసిన సిపిఎం 23వ మహాసభ ఇదే విధమైన పిలుపునిచ్చింది. ఈ మహాసభ సందర్భంలోనూ హైదరాబాద్ సమావేశాల సమయంలోనూ కూడా ఏచూరి ఎన్నికల ఫలితాల తర్వాతనే ఏ సంఘటనైనా సాధ్యమని సోదాహరణంగా చెప్పారు.
కేంద్ర కమిటీ సమావేశాలకు వచ్చినప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీతారాం ఏచూరి తదితరులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి చర్చలు జరపడంపై బిజెపి చాలా ప్రచారాలు చేసింది. దేశ రాజకీయ పరిస్థితులు బిజెపిని ఓడించవలసిన అవసరం వుందని చర్చలలో ఉభయులూ అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. వివరంగా రాజకీయ చర్చలు జరిపినట్టు అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా నోట్ విడుదల చేసింది. ఇదే సమయంలో హైదరాబాదు పర్యటనలో వున్న సిపిఐ కార్యదర్శి రాజా కూడా తెలంగాణ నాయకులతో కెసిఆర్‌ను కలిశారు. తాము మౌలికంగా బిజెపిని ఓడించేందుకు కృషి జరగాలనే విషయం మాట్లాడామని, తెలంగాణలో నిర్దిష్టంగా ఏం చేయాలో రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంటుందని ఏచూరి మీడియాకు చెప్పారు. దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ఎన్నికలు వచ్చినపుడు పొత్తులు, ఎత్తుగడలు నిర్ణయమవుతాయి తప్ప ముందస్తుగా వాటి గురించి నిర్ణయాలు వుండబోవని వివరించారు. కనుక పొత్తులు కూటముల కోసం రావలసిందిగా ఆహ్వానించిందే లేదు. బిజెపి వ్యతిరేక ఫ్రంట్ కోసం కెసిఆర్ పనిచేస్తున్నారనే వార్తను అనేక పత్రికలు, చానళ్లు ప్రముఖంగా ఇచ్చాయి. మోడీని ఓడించడం చెత్త ఎజెండా అయి వుంటే వీటన్నిటికీ ఆస్కారం లేదు. ప్రత్యామ్నాయం విధానపరంగా వుండాలనేది నిజమే అయినా అది బ్రహ్మ పదార్థం కాదు. బిజెపిపై కలసి పోరాడదామని తమతో చెప్పిన కెసిఆర్ ఎందుకు ప్లేటు ఫిరాయించింది ఆయనే చెప్పాలని ఏచూరి ఇటీవల అన్నారు.
దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఎ.పి, తెలంగాణలలో బిజెపికి బలం లేదు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్, జెడిఎస్‌ల పోటీ వుంటుంది. ఎ.పి, తెలంగాణ లోని వైసిపి, టిఆర్‌ఎస్ పార్టీలు పార్లమెంటులో చాలాసార్లు మోడీ విధానాలకు మద్దతునిచ్చినా బిజెపి నేతలు మతతత్వ రాజకీయాలను అంతకంతకూ పెంచుతూనే వస్తున్నారు. గుంటూరులో జిన్నా టవర్ వివాదం, తెలంగాణలో హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలనే పిలుపు ఇందులో భాగాలే. ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా మారిపోయాయని ఆ పార్టీ నేతలు అంటుంటారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్, బిజెపిలకు సమదూరంలో వుంటానని కెసిఆర్ సూచించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరబోనని ప్రకటించడం, తనే స్వంతంగా పార్టీ ఏర్పాటు చేసి బీహార్‌లో తొలి అడుగులు వేస్తానని చెప్పడం చూస్తున్నాం.
ఫ్రంట్‌లు అప్పుడే కుదరవని ఏచూరి వంటివారు చెప్పినప్పుడు హడావుడి పడిందీ, దాని నాయకత్వంపై ఊహాగానాలకు తెర లేపింది మమతా బెనర్జీ, కెసిఆర్ వంటి నాయకులే. ఎవరి ఉద్దేశాలు ఏమైనా ఎవరి వ్యూహాలు ఎలా వున్నా కార్పొరేట్-మతతత్వ రాజకీయాలను ఓడించి తీరాలి. వైసిపి మరోసారి బిజెపికి దగ్గర కావడమే కనిపిస్తుంది. టిడిపి కూడా కేంద్రం తప్పుల గురించి వివక్ష గురించి పెదవి మెదపడం లేదు. 'సిపిఎం, వామపక్షాలు బిజెపిని ఒంటరిపాటు చేయాలి. ఓడించాలి' అన్న అంశం పైనే తప్పక కేంద్రీకరించి పోరాడతాయి. రోజురోజుకు జరిగే పరిణామాలు దాన్ని మరింత అవసరంగా మారుస్తున్నాయి.
- పీ పీ