
ప్రజాశక్తి - బాపట్ల
దేశ వ్యాప్తంగా బిజెపి చేస్తున్న మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌కె మస్తాన్‌వలి కోరారు. బాపట్ల కాంగ్రెస్ అధ్యక్షులు డి దేవరాజు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో గురువారం నిర్వహించిన బీసీ కులగణనపై బిజెపి మతతత్వ వాదనను తిప్పి కొట్టాలనే అంశంపై జరిగిన చర్చ వేదికలో ఆయన మాట్లాడారు. మతతత్వాన్ని రెచ్చగొట్టే ధోరణి కేంద్రంలోని బిజెపి అలంబిస్తుందని అన్నారు. బిజెపి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ బిజెపి విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనించాలని కోరారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బిజెపి పాలనకు చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మంగళగిరి ఇంచార్జ్ సలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతా బాబురావు, మైనార్టీ నాయకులు పఠాన్ రాజేష్, దండు రేణుక, మాజీ కౌన్సిలర్లు నక్కల రాంబాబు, బక్కా రోశయ్య, ఇస్సాక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.