ప్రజాశక్తి-తాడేపల్లి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సిపిఎం సీనియర్ నాయకులు జొన్నా శివశంకరరావు హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో సిపిఎం రూరల్ కమిటీ సమావేశం యశోధ అధ్యక్షతన జరిగింది. శివశంకరరావు మాట్లాడుతూ మతం పేరుతో మైనార్టీలు, దళితులపై దాడులు చేస్తున్న బిజెపిని నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యంగ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ చివరకు పత్రికా యాజమాన్యంపై కూడా దాడులు చేసి దుర్మార్గంగా జైల్లో పెట్టిన బిజెపి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదన్నారు. దేశభక్తులు అందరూ బిజెపి వ్యతిరేక పోరాటం కలిసి రావాలని కోరారు. కమ్యూనిస్టులకు సీట్లు, ఓట్లు ముఖ్యం కాదని దేశ ప్రజల అభివృద్ధి, సఖ్యత అవసరమని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరారు. బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ సరైన పాత్ర పోషించడం లేదని, తెలంగాణలో ఆ పార్టీ అనుసరించే వైఖరే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ కార్యదర్శి డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.
సుందరయ్య నగర్‌లో ప్రచారం
బిజెపి అవలంభిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల దేశంలో నడుస్తున్న చీకటి రాజ్యం మనకొద్దని సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కొట్టె కరుణాకరరావు అన్నారు. శుక్రవారం రాత్రి సుందరయ్యనగర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ విజయవాడలో జరిగే ప్రజా రక్షణభేరి సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో బాష, ప్రభాకరరావు, ఉష, గిరిజ, కొండబాబు పాల్గొన్నారు.










