ప్రజాశక్తి రొద్దం : మట్టివాసన తెలిసిన కవి కోగిర జైసీతారం అని ప్రముఖ ప్రజా కవి ఏలూరి యంగన్న అన్నారు. కవికాకి కోగిర జైసీతారామ్ 99 వ జయంతి సందర్బంగా మంగళవారం స్థానిక కోగిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కవి జాబిలి చాంద్ బాషా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కోగిర సీతారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాహితీ స్రవంతి, సత్యసాయి జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి అధ్యక్షత వహించగాప్రధాన వక్తగా పాల్గొన్న ఏలూరు యంగన్న మాట్లాడుతూ జైసీతారాం మట్టి వాసన తెలిసిన కవి అని అన్నారు. పల్లె మనుషుల మనసెరిగినవాడు, చిన్నతనంలోనే మేకలు కాసి కష్టాలను చవి చూచినవాడు, పల్లె ప్రజల జీవనశైలి తెలిసినవాడు, కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో నివశించిన వాడు అని అన్నారు. కరువు ప్రాంతంలో సాహిత్య బతుకు బండిని లాగిన వాడని చెప్పారు. రాయలసీమ లో పేద ప్రజల మధ్యే ఉంటూ ఆ భాషను, వారి జీవితానుభవాలను పూర్తిగా జీర్ణించుకుని వారికోసం వారి భాషతో కవిత్వం అల్లిన ప్రజాకవి జైసీతారాం అని అన్నారు. తబలా, హార్మోనియం వాద్యకారులు, చిత్రలేఖనంలోను ఆయన ప్రావీణ్యత సాధించారని కొనియాడారు. జి.ర.సం అధ్యక్షులు జాబిలి చాంద్‌బాషా మాట్లాడుతూ పద్యం అంటే సంస్కృత పదబందం కాదని, సాహిత్యం అంటే పాతపురాణాలను వల్లె వేయటం కానే కాదని, నిజ జీవిత పోరాటాన్ని వాడుక పదాలతో పద్యంలో చూపిన పద్య కవి జైసీతారాం అని అనాఉ.అసలు సిసలైన ఉపాధ్యాయుడు,ఆధునిక భావాలతో సమాజాన్ని జాగృత పరిచిన నిజమైన సాహితీ కారులు, సొంత ఊరిపేరునే ఇంటిపేరుగా మలచుకున్న గొప్ప కవి మన కవి కాకి కోగిర జైసీతారాం అని అన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్ ఎ.హరి,కొగిర జయచంద్ర, శివరాం మాట్లాడుతూ జైసీతారామ్ బాలల దినోత్సవం రోజు నవంబర్ 14 న జన్మించారని, తన బాలగేయాలతో, కవితలతో విద్యార్థులను భావిభారత ఉత్తమ పౌరులుగా మలచడానికి,అటు మెరుగైన సమాజ స్థాపనకు జీవితమంతా కృషిచేశారని అన్నారు. ఇంతటి గొప్ప ప్రజా సాహితీ వేత్త జయంతి సభలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈసందర్భంగా కోగిరి జైసీతారామ్ కుమారులు కోగిర జయచంద్ర అతిథితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, కోగిర జై సీతారామ్ అభిమానులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.