ప్రజాశక్తి- బొబ్బిలి : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా పర్యావరణ హిత మట్టి వినాయకుని పూజించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. ఆదివారం బొబ్బిలి పట్టణంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని ప్రతిమలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సాయి సర్వాణి కాలనీలో మట్టి వినాయక విగ్రహాలను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.సత్యంనాయుడు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వనమిత్ర, గ్రీన్ బెల్ట్ అద్యక్షులు కె.కృష్ణదాసు, ఎస్‌వి రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యాలయంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
శృంగవరపుకోట: మండలంలోని భవాని నగర్‌లోని గౌరీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో ఆదివారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాండ్రేగుల వెంకటరాము, బోనీ నరేష్, సుంకరి నాని పాల్గొన్నారు. గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) ఆధ్వర్యంలో భర్తాపురం గ్రామంలో ప్రసన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. జియో వ్యవస్థాపకుడు బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వేపాడ: గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) ఆధ్వర్యంలో బొద్దాం గ్రామంలో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిమ్ బొద్దాం శాఖ కార్యదర్శి కర్రి కేశవరత్న కుమారి ప్రారంభించారు. జియో వ్యవస్థాపకుడు బి.రామకృష్ణ మాట్లాడుతూ వివిధ రకాల రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాల వల్ల జలవనరులు కాలుష్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యమ్.సూర్యకాంత్, యేడువాక రవి, శ్రావణి, హృషీకేష్, లాస్యశ్రీ, లవిత్ పాల్గొన్నారు. కొత్తవలస : మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో పరదా పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వానదు హరికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి, లీగల్ అడ్వైజర్ గవర కృష్ణ, ట్రస్టు సభ్యులు నగేష్, వినాయక నగర్ సభ్యులు కొప్పిశెట్టి రమణ, మెడికల్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
రామభద్రపురం: పర్యావరణ హితమైన మట్టి ప్రతిమలతో వినాయక చవితి పూజలు జరుపుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు పిలుపునిచ్చారు. ఆదివారం రామభద్రపురం గ్రామీణ బ్యాంక్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ క్లబ్ కోశాధికారి రొటేరియన్ శ్రీనివాసన్ ఆర్ధిక సహకారంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థులు ప్రతిభ
ప్రజాశక్తి- బొబ్బిలి
స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కాలుష్యం నివారణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలు, భక్తులకు సందేశాన్ని ఇవ్వడానికి పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. మట్టితో తయారు చేసిన విగ్రహానికి రంగులు వేసి వినాయక పూజలు చేసేందుకు విద్యార్థులు సిద్ధం చేశారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ రఘునందన్ అభినందించారు.










