Jul 04,2021 11:28

మట్టితో మమేకమైన రైతన్నకు ఆ వాసనే సుగంధమైనది
నాగలి పట్టి దుక్కి దున్నే రైతన్నకే మట్టి వాసన విలువ తెలుసునని
పల్లెల్లో మాత్రమే ఆస్వాదించగలం ఈ మధుర సువాసన
పుడమి తల్లి పురుడు పోసుకున్న కమ్మనైనవాసన

చిట పట చినుకుల కలయికలో
తన పరిమళాన్ని మరింతగా వెదజల్లుతానంది
పచ్చటి పంట పొలాలతో చెలిమి చేస్తానంది
వరినాట్లు నాటేటప్పుడు గుజ్జుగా
గుమికూడి ప్రాణం పోస్తానంది
హలం కౌగిలిలో, కాడెడ్ల అడుగుల సవ్వడిలో లీనమై పునీతగా మారతానంది

పట్నాలలో దొరకని వెలకట్టలేని నిధి సూటుబూటులేసుకొన్న మారాజులు
నిలువెత్తు ధనమిచ్చినా దొరకని పరిమళం ఇది
రైతన్న స్వేద బిందువులతో ఐక్యమై వెలువడే సుగంధ మిది
పల్లెకు శాశ్వత చిరునామా ఇది
అత్తరు పరిమళం కన్నా మిన్న

వర్ష ఋతువు ఆరంభవేళ
కాలిన మట్టికి స్వాంతన చేకూరుస్తూ
ఆ చినుకు ముత్యం నేలను చేరి ముద్దాడే తొట్టతొలి క్షణాన
నాసికాగ్రాలకు సంధానమైనప్పుడు..
అబ్బ అప్పుడు తెలుస్తుంది ముక్కు పుటలకు తొలిసారి ఆ పరిమళం
బహుళ అంతస్తుల సముదాయాల మధ్య
కాక్రీటు అడవులలో మారుతోంది మిధ్యగా నేడు ఆ కమ్మదనం

కరాళ మృత్యు కౌగిలి కబళిస్తే తన కమ్మనైన సువాసనతో
చివరి సంస్కారానికి రారమ్మంటూ ఆహ్వానం పలుకుతూ
తనలో లీనం చేసుకునే గొప్పదైనదే మట్టివాసన
 

- కెవివి లక్ష్మీ కుమారి
96424 59239