ప్రజాశక్తి - వినుకొండ: ప్రభుత్వ భూమిలో మట్టిని ఆవుల ఫారం పరిశ్రమకు అక్రమంగా తరలించి మట్టిని దొంగిలించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీ.వీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వినుకొండ మండలం వెంకుపాలెం రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 1 ప్రభుత్వ భూమిలో సోమవారం టిడిపి శ్రేణులతో కలిసి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాలను నడుపుతున్నారని, గుండ్లకమ్మ నుండి కొన్ని వేల ట్రక్కులు ఇసుకను తరలించి రూ.కోట్లు గడించారని ఆరోపించారు. తన సొంత స్థలంలో ఆవుల పరిశ్రమకు అవసరమైన మట్టిని వెంకుపాలెం రెవెన్యూ ప్రభుత్వ భూమి నుండి వేల లారీల మట్టిని అక్రమంగా తరలించాలని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేయించారని, కొన్నిచోట్ల పేద రైతుల భూములు కూడా లాక్కున్నారని, ప్రతిఘటించిన వారిపై దాడులు చేయించి తప్పుడు కేసులు కూడా పెట్టించారని విమర్శించారు. సమాచారం తెలుసుకున్న వినుకొండ తహశీల్దార్ కిరణ్ కుమార్, ఆర్‌ఐ, విఆర్వోలు సంఘటన ప్రాంతానికి చేరుకోగా తహశీల్దార్ కిరణ్‌కుమార్‌కు జీవీ ఆంజనేయులు వినతిపత్రం ఇచ్చారు. తహశీల్దార్ స్పందిస్తూ ఎమ్మెల్యే ఆవుల ఫారానికి మట్టి తరలించినట్లు ఆధారం లేదన్నారు. ఎమ్మెల్యే పొలంలో పునాదుల కోసం మట్టి తవ్వకాలు చేసి కుప్పలుగా వేసి ఉండటం గుర్తించామనానరు. ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా మట్టి అక్రమ తవ్వకాలంటూ జీవీ ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలు నీచ రాజకీయమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఖండించారు. తన పొలలోకి మట్టిని తోలామని ఆధారాలుంటే నిరూపించాలని సవాలు విసిరారు. తన పొలంలో డెయిరీ ఫాం నిర్మాణం కోసం నేలను చదును చేసి, పునాదులు కోసం తీసిన మట్టిని కుప్పగా పోశామన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన జీవీ ఆంజనేయులపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. డైరీ ఫాం నిర్మాణంలో ఉండగా ఇక్కడ అనేక రకమైన, విలువైన పరికరాలు, పనిముట్లు ఉన్నాయని, అవి ఏమైన అపహరణ అయితే పూర్తి భాద్యత జివి ఆంజనేయులు వహించాల్సి ఉంటుందని అన్నారు.










