ప్రజాశక్తి-పుట్లూరు మండలంలో ఎక్కడెక్కడ అనుమతి తీసుకుని మట్టిని తరలిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన స్కూటర్ యాత్ర సందర్భంగా సోమవారం మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన మట్టి తవ్వకాలను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో మట్టిని తరలించేందుకు ప్రయివేట్ సంస్థలకు అప్పగించారన్నారు. అయితే ఏ సర్వే నెంబర్‌లో.. ఎన్ని ఎకరాలకు అనుమతి ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలల నుంచి పెద్ద పెద్ద జెసిబిలను వినియోగించి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఇలా తరలించడం ద్వారా రోడ్లన్నీ గుంతలమయం అవుతున్నాయన్నారు. దీనికితోడు దుమ్మూధూళితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లు పెద్ద పెద్ద గోతులను తలపిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. అనుమతులు ఒకచోటు.. మట్టి తరలింపు మరోచోట జరుగుతున్నట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ సర్వే నెంబర్లలో.. ఎన్ని ఎకరాల్లో.. ఏఏ వాహనాలకు అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం.కృష్ణమూర్తి, మండల కార్యదర్శి సూరి, సహాయ కార్యదర్శి వెంకట్‌చౌదరి, మండల నాయకులు పెద్దయ్య, భాస్కర్‌రెడ్డి, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.