Dec 20,2020 12:31

ట్టి సలసల మసిలి..
కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది !

కర్రు కొలిమిలో ఎర్రగా కాలి..
నిరసనల చురకల వాత పెట్టింది !

కొడవలి కోపతాపంతో చట్టాల్లోని...
కలుపును కోసే తెగువ చూపింది !

గడ్డపార భీకరంగా గర్జించి...
కార్పొరేటును కాటేయ చూసింది !

ఎడ్లబండి ఎగిసిపడి...
రోడ్డుకు అడ్డుపడి కన్నెర్ర చేసింది !

కర్షక లోకసంద్రం ఏకమై..
నాగేటి సాళ్లల్లో గింజై రగిలింది !

రైతు గొంతు రౌద్రంతో...
ఢిల్లీ పీఠం దద్దరిల్లింది !

ఏకతాటిపై భారతం...
రైతుపక్షపాతియై
హోరెత్తింది !

నేలతల్లి నిశ్శబ్ద నినాదం...
అధికారాన్ని నిలదీసింది !

నాగేటి సాళ్లు సాగి...
మౌనాన్ని చీల్చి మాట
మొలిచింది !

భారతమంతా బందుతో..
అష్టదిగ్బంధం దిగ్విజయమైంది !

కలుపు చట్టాలపై సమరశంఖంతో..
పల్లె పట్నం జనం ఏకమయ్యింది !

అన్నదాతకు అండదండగా..
భారతమాత నిలబడి గళం కలిపింది !

నేను సైతం అంటూ...
పంట పైరు రైతెంట నడిచింది !

ఒక్కటై నిలిచిన భారతం..
విష చట్టాల సంకెళ్లు ఛేదిస్తోంది !

- డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037