Apr 11,2021 17:20

ఆ పాదాలకు
తాలు ఇత్తులను కల్లంగెట్టు
దాటేయడమే కాదు
వాటి తలరాతలనూ
రాయడము దెలుసులే....

సుట్టంచూపుగా
ఐదేళ్లకొకసారి
వాకిట్లోకి వచ్చి
వొగలుఎల్లవోసే
కోతలరాయుల
కల్మషబుద్ధి ఆగడాలు దెలుసులే....

నరంలేని నాలుకతో
నడి ఎండాకాలంలో
మంచు గురిపించే
మాటకారిల భారతం
బండారం గూడదెలుసులే

నెర్రలు బారిన నేలను
పల్లుగొర్రుతో పలగదున్నుతూ
పచ్చినెత్తురు గారుస్తూ
ప్రపంచానికి బతుకునేర్పడమూ
తెలుసులే ....
కరువుతో
వంచించిన కాలానికి
మేడితోకతో బుద్ధిచెప్పిన
మట్టి మనిషి పాదాలు కాదా అవి...

స్వార్థంపై సవారీలు జేటసే
సన్యాసులను అణచడము గూడా దెలుసులే ఆ మట్టి పాదాలకు....

పల్లేరు గాయలపై పరిగెత్తి
పలుగురాళ్ళను పగులగొట్టి
మదమెక్కిన దున్నపోతుకే
ముక్కుతాడేసి ....
మాగాణి దున్నిన
మట్టి మనిషి పాదాలు అవి...

తంగేడు మొలిచిన నేలలో
సిరుల పంటలకు మూలాధారమైన
అవని పుత్రుని అందెలు
మట్టి పాదాలు...

మౌనాన్ని ఆభరణంగా
మట్టివోసననే అత్తరుగా
దేహాన్ని దేవాలయంగా జేసుకొని
కోవెలలేని విశ్వంలో
ప్రతి మెతుకులో కొలువై యున్నా
రైతువి ఈ మట్టి పాదాలు........

మరణంలేని చిరంజీవివి
ఈ మట్టి పాదాలు.....

- ఉప్పరి తిరుమలేష్‌
9618961384