
ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలోని కొత్త ఎల్లవరం, కసిమి గ్రామాల్లో ఆర్‌బికే సిబ్బందికి మట్టి నమూనా సేకరణ, వాటి ఆవశ్యకతపై మండల వ్యవసాయ అధికారి కె.సుధారాణి అవగాహన కల్పించారు. మరికొద్ది రోజుల్లో తొలకరి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సిబ్బంది గ్రామాల పరిధిలో ఉన్న రైతులు అందరికి మట్టి పరీక్షలపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు పంటలు వేయుటకు ముందుగా మట్టి పరీక్షలు చేయించుకుంటే సూక్ష్మ, స్థూల పోషకాల లభ్యతను తెలుసు కోవచ్చని, దీంతో నేలలో ఉన్న సారాన్ని వాడుకోవచ్చనన్నారు. ఎరువులు అమితంగా వాడటంతో పర్యావరణ కాలుష్యాన్ని నివారించ వచ్చన్నారు. ఆర్‌బికే సిబ్బందికి మట్టి పరీక్షలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీల ఆర్‌బికే సిబ్బంది, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.