ప్రజాశక్తి -యంత్రాంగం
భీమునిపట్నం : మట్టి నమూనాల సేకరణ, పరీక్షల ఆధారంగా వినియోగించే ఎరువుల వాడకం వల్ల పంట అధిక దిగుబడి వస్తుందని స్థానిక వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ బొడ్డేపల్లి విజయ ప్రసాద్ స్పష్టం చేశారు. మండలంలోని మజ్జివలస రైతు భరోసా కేంద్రంలో గురువారం వ్యవసాయ శాఖ మండల, గ్రామ స్థాయి వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు మట్టి నమూనాల సేకరణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయప్రసాద్ మాట్లాడుతూ, భూసార సేకరణ, పరీక్ష కార్యక్రమాలు గత మూడేళ్లుగా జరగలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మట్టి నమూనాల సేకరణ, పరీక్షలను నిర్వ హించి, ఫలితాల ఆధారంగా రైతులు సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూసారం బాగుంటేనే పంటల సాగు, దిగుబడి బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి మన్మధరావు, జిల్లా వనరుల కేంద్రం శిక్షణా అధికారి చదువుల సుబ్రహ్మణ్యం, జిల్లా భూసార పరీక్షా విభాగం ఎడిఎ శ్రీదేవి, మండల వ్యవసాయ శాఖ అధికారి బి.శివకోమలి తదితరులు పాల్గొన్నారు.
కోరాడలో శిక్షణ
పద్మనాభం : మండలంలోని కోరాడ రైతు భరోసా కేంద్రంలో మట్టి నమూనాలపై వ్యవసాయ శాఖాధికారులు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మండల ఇన్‌ఛార్జి వ్యవసాయాధికారి బి.శశికళ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తుర్వుల ప్రకారం ఈ సీజన్ నుంచి మట్టి నమూనాలు సేకరించి, వాటి ఫలితాలు ఆధారంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించేటట్లు చేయాలని సూచించారు. మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, భూసార పరీక్షలు అనుసరించి ఎరువులు వాడకాన్ని తగ్గించడం, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడంపై వివరించారు. ప్రతి రైతూ భూసార పరీక్షలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమములో భీమిలి ఎడిఎ బి.విజయప్రసాద్, ఉద్యానశాఖ అధికారి మన్మధరావు, జిల్లా శిక్షాణాధికారి సిహెచ్ సుబ్రహ్మణ్యం, జిల్లా భూసార పరీక్ష ఎడిఎ దేవి తదితరులు పాల్గొన్నారు.










