మన్నులో స్వర్ణాక్షరాలు
ఆర్భాటంగా లిఖించబడ్డాయి
ఒక్కో అక్షరానికి మూల్యం కట్టాలి
ఒక్కో గింజకూ లెక్క చెప్పాలి
పన్ను కన్నుని పొడిచినా
వెన్ను విరిచి పని చేయాలి
రాశి వాసికి రాకపోయినా
మట్టిలో మెతుకుల్ని
విదిలించుకుని పూట గడపాలి
ఎముకల తొట్లో
దేహాన్ని అటూ ఇటూ ఊపుతూ
ఊపిరికి చలవనివ్వాలి
ఒట్టి మట్టి ముద్రగాళ్లం
ఎవరు మమ్మల్ని ఏమార్చినా
మట్టి మాత్రం ఏమార్చదు
జీవితాంతం మట్టి ముద్రనే
పచ్చబొట్టుగా వేసుకుని
అందులోనే కలిసిపోవాలి
ఎంగిలి పడని చేయి సాక్షిగా
పీలికలైన పేలికల్ని చుట్టుకుని
ఆకలి పాటకు దరువెయ్యాలి
నాగలి పోటుకు తూలినోళ్లం
చీడ పురుగు కాటుకు బలైనోళ్లం
రైతుగా కాలం వెల్లబుచ్చాలి
కాసింత ఉప్పు రేటు కూడా
అనకొండంత కనిపిస్తే
రెక్కలు మడిచి దాక్కోవాలి
చెదిరిన గూడు పైకప్పును
పండిన తుప్పుతోనే కప్పెట్టుకోవాలి
ఏలిక మేకై గుచ్చుకున్నాక
వెర్రి చూపులు చూస్తా ఆ చివరన
మట్టి మనిషి లెక్కన నిలుచోవాలి
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636