Aug 03,2023 23:02

సందడి చేసిన నాగచైతన్య

- మత్స్యకారుల జీవన స్థితిగతుల ఇతివృత్తంగా సినిమా
- హాజరైన డైరక్టరు సింధు మొండేటి, బన్ని వాసు
ప్రజాశక్తి - ఎచ్చెర్ల, శ్రీకాకుళం అర్బన్‌: 
ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంలో సినీ నటుడు నాగచైతన్య గురువారం సందడి చేశారు. డైరెక్టర్‌ చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాసుతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. మత్స్యకారుల జీవన స్థితిగతులు ఇతివృత్తంగా ఆయన నటించనున్న సినిమాకు సంబంధించి మత్స్యకారులతో మాట్లాడారు. సినిమాలో కనిపించే హీరో తీర ప్రాంతానికి రావడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాగచైతన్యను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు ఆరాటపడ్డారు. అనంతరం నాగచైతన్య విలేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల కిందట దర్శకుడు చందు మొండేటి మత్స్యకారుల జీవన విధానంపై తనకు కథను వినిపించారని, ఆ కథ తన మనసును తాకడంతో వెంటనే ఓకే చెప్పానన్నారు. మత్య్సకారుల జీవన విధానం తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను అక్కడి కోస్ట్‌గార్డు సిబ్బంది అరెస్టు చేశారని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్ట్‌గార్డు సిబ్బందికి ఎలా చిక్కారు, అక్కడి జైళ్లలో పడిన ఇబ్బందులు, పాక్‌ ప్రభుత్వం వీరిని ఏవిధంగా విడుదల చేసిందీ అన్న అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. చిత్రం ప్రారంభానికి ముందే మత్స్యలేశం గ్రామాన్ని సందర్శిద్దామని, అంశాలన్నీ అధ్యయనం చేశాకే షూటింగ్‌ను ప్రారంభిద్దామని నాగచైతన్య చెప్పడంతో ఇక్కడికి వచ్చామని పాక్‌ కోస్ట్‌గార్డులకు చిక్కిన డి.మత్స్యలేశానికి చెందిన రామారావు నుంచి పూర్తి వివరాలను అధ్యయనం చేశారు.