ప్రజాశక్తి -భీమునిపట్నం : అన్ని విధాలా వెనుకబడిన మత్స్యకారుల్లో మరింతగా రాజకీయ చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని జివిఎంసి నాలుగో వార్డు కార్పొరేటర్, మత్స్యకార నాయకులు దౌలపల్లి కొండబాబు అన్నారు. వార్డు పరిధిలోని చేపలుప్పాడ, చొక్కవానిపాలెంలో ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్ట సభల్లో మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం ద్వారానే తమ హక్కులు, అదనపు సౌకర్యాలు పొందడం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఏటా జూన్ నెలలో సముద్రంలో వేట సాగేదని, ఇప్పుడేమో నవంబర్ నెల వచ్చినా సరే వేట సాగే పరిస్థితులు లేవని తెలిపారు. సముద్రంలో మత్స్య సంపద గణనీయంగా తగ్గడమే కారణమని అభిప్రాయ పడ్డారు. మత్స్యకార నాయకులు వాసుపల్లి నల్లబాబు, కారి అప్పారావు, వాసుపల్లి ఎల్లయ్య, దూడ అచ్చారావు, మారుపల్లి అమర్నాథ్, ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు చొక్కా భాస్కరరావు తదితరులు మాట్లాడుతూ, అన్ని విధాలా వెనుక బడిన మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ మేరకు ముందుగా రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. సభ అనంతరం పేద మత్స్యకార మహిళలకు సంఘం ఆధ్యర్యంలో కార్పొరేటర్ కొండబాబు దుప్పట్లు పంపిణీ చేశారు.










