ప్రజాశక్తి-నక్కపల్లి:మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు తెలిపారు. హెటిరో పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహాధర్నా ఆదివారం నాటికి 361వ రోజుకు చేరింది.పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు అప్పలరాజు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెటిరో వ్యర్థ జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి మత్స్యకారులు ఉపాది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 361 రోజుల నుండి పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు ధర్నా చేస్తున్నప్పటికీ నేటి వరకు సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడం దారుణమన్నారు.ఈ ప్రాంతంలో వేట సాగక పోవడంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోవడం జరుగుతుందన్నారు.మత్స్యకారుల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో కూడా కొత్త పైపులైనుకు అనుమతులు ఇవ్వకూడదని అన్నారు. కంపెనీ వేసిన కొత్త పైప్ లైన్ పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార జెఎసి ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరాజు, సిపిఎం మండల కార్యదర్శి సిపిఎం రాజేష్, మత్స్యకార నాయకులు పిక్కీ గంగరాజు, గోసల స్వామి, దైలపల్లి శ్రీను, యుజ్జల అప్పలరాజు, చేపల సోమేష్, కారే కోదండరావు, చొక్కా గోపి, మైలుపల్లి బాబ్జి, మైలపల్లి శివాజీ, గోసల అంజి, దైలపల్లి ఆనంద్ కుమార్, గోసల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










