May 17,2023 01:01
మత్స్యకారులతో సిఎం జగన్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఆక్వా, మత్స్యకార రంగాలకు మేలు జరిగేలా పలు పనులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మత్స్యకార భరోసా సాయాన్ని జమ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబా లకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జమ చేశారు. ఇప్పటి వరకు రూ.538 కోట్ల సాయం అందజేసినట్లు ఈ సందర్భంగా సిఎం చెప్పారు. తాము ఇస్తున్న పథకాల ద్వారా లబ్ధిదారుల సంఖ్య 55 శాతం పెరిగిందని, గత ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే తాము ఇప్పుడు రూ.9 ఇస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. గతంలో 1100 బోట్లకు సబ్సిడీ ఇస్తే ఇప్పుడు 20 వేల బోట్లకు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం అందేదని, గత ప్రభుత్వంలో ముష్టి వేసినట్లు రూ.4 వేలు కొంత మందికే ఇచ్చేవారని, చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమేనని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చంద్రబాబు పెట్టిన రూ.451 కోట్లతో కలిపి రూ.2,792 కోట్లు విద్యుత్‌ సబ్సిడీ చెల్లించినట్లు తెలిపారు. గోదావరి జిల్లాలో ఫిషరీష్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మత్స్యకారుల వలసలు లేకుండా కొత్తగా 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, 4 పోర్టులను నిర్మిస్తున్మామని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1.50కే ఇచ్చామని తెలిపారు. గతంలో పాలనచేసిన వారు, ఆ పాలకులకు మద్దతు ఇస్తున్న వారు పేదవారికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్‌ సభ్యులు నందిగాం సురేష్‌, శాసనమండలి సభ్యులు పోతుల సునీత, శాసనసభ సభ్యులు, కోన రఘుపతి, మేకతోటి సుచరిత, కరణం బలరాం కృష్ణమూర్తి, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిషత్‌ చైర్‌ పర్సన్‌లు బూచేపల్లి వెంకాయమ్మ, హెన్రీ క్రిస్టీనా, ప్రజా ప్రతినిధులకు, అతిథులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.