Aug 06,2023 23:00

సమావేశంలో మాట్లాడుతున్న గౌతు శిరీష

* పోర్టు నిర్మాణంతో వైసిపి నాయకులకే లబ్ధి
* అబద్దాలు చెప్పడంలో మంత్రి అప్పలరాజు ఆరితేరారు
* టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
ప్రజాశక్తి- పలాస: 
నాలుగేళ్లుగా మత్స్యకారులను మోసం చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప వారి అభివృద్ధికి ఏం చేశారో చెప్పగలరా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మంత్రి సీదిరి అప్పలరాజును ప్రశ్నించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మత్స్యకార తరగతిలో పుట్టి మత్స్యశాఖ మంత్రిగా పదవి చేపట్టిన అప్పలరాజు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన 200 కుటుంబాలకు మత్స్యకార భరోసా రాకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నువ్వులరేవుకు చెందిన మత్స్యకార విద్యార్థి అనుమానాస్పద మృతి చెందితే ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూలపేటలో పోర్టు ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు లబ్ధి పక్కన పెడితే, వైసిపి నాయకులకే లబ్ధి చేకూరుతోందని ఆరోపించారు. మంచినీళ్లపేట, నువ్వలరేవు ప్రాంతంలో హార్బర్‌ నిర్మిస్తామని మత్స్యకారులకు కల్లబొల్లి మాటలు చెప్పి, రక్షణ గోడ నిర్మించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైసిపి హయాంలో పోర్టులు, హార్బర్లు పూర్తి చేయగలమని దమ్ముంటే చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. టిడిపి హయాంలో 75 శాతం సబ్సిడీపై బోట్లు, ఇంజిన్లు, వలలు మత్స్యకారులకు పంపిణీ చేశామన్నారు. పది శాతం సబ్సిడీపై డీజిల్‌ ఇచ్చామని చెప్పారు. తుపాను సెంటర్లు, చేపలు ఆరబెట్టేందుకు షెడ్లు నిర్మించామన్నారు. వైసిపి హయంలో మత్స్యకారులకు ఏ పథకాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఆఫ్‌షోర్‌ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ప్రతి సమావేశంలో మంత్రి చెప్పడమే తప్ప, పూర్తి చేసే పరిస్థితి లేదని విమర్శించారు. వైసిపి ప్రభుత్వంలో కేవలం రూ.తొమ్మిది కోట్లు మాత్రమే వెచ్చించి పనులు చేపడితే, టిడిపి హయాంలో రూ.450 కోట్లతో పనులు చేపట్టామన్నారు. మంత్రి అధికార అహంకారంతో వ్యాపార సముదాయాలు ధ్వంసం చేసి నేటికి మూడేళ్లు కావస్తున్నా కెటి రోడ్డు విస్తరణ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఎన్నికలు ముందైనా ఆ రోడ్డు పూర్తి చేస్తారో, లేదో చెప్పాలన్నారు. కిడ్నీ ఆస్పత్రికి భూసేకరణ చేసి నిధులు మంజూరు చేసింది టిడిపి ప్రభుత్వమేనని వైసిపి నాయకులు గుర్తించుకోవాలన్నారు. వైసిపి హయాంలో నల్లబొడ్డులూరు, సూదికొండ, నెమలికొండలను మింగడమే తప్ప ఏం అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో మంత్రి అప్పలరాజు ఆరితేరిపోయారన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, వజ్రపుకొత్తూరు మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, బిసి సెల్‌ కార్యదర్శి గోవింద పాపారావు, మందస మండల అధ్యక్షుడు భావన దుర్యోధన, బడ్డ నాగరాజు, టంకాల రవిశంకర్‌ గుప్త, ఎం.నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.