ప్రజాశక్తి-నక్కపల్లి:మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు తెలిపారు. హెటిరో పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహాధర్నా ఆదివారం నాటికి 356వ రోజుకు చేరింది.పైప్ లైన్‌కు కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు అప్పలరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెటిరో వ్యర్థ జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి మత్స్యకారులు ఉపాది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెటిరో కంపెనీ వేసిన కొత్త పైప్ లైన్ పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో కూడా కొత్త పైపులైనుకు అనుమతులు ఇవ్వకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం.రాజేష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వాసుపల్లి నూకరాజు, కోడా కాశీరావు, మైలపల్లి జాన్, మైలపల్లి బాపూజీ తదితరులు పాల్గొన్నారు.










