Oct 13,2023 23:16

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండంగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. ఎస్‌.యానాం మత్స్యకారులు ఆ గ్రామ సముద్రపు పర్ర లో చేపల వేట ద్వారా జీవనం సాగిస్తుండగా గత వేసవిలో చేపలు చనిపోయి నీటిపై తేలిపోయాయి. దీంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు.ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్‌ గ్రామంలోని చమురు క్షేత్ర యాజమాన్యం వేదాంత కెయిర్న్‌ ఎనర్జీ అధికారులతో మాట్లాడి మత్స్యకారులకు సాయం అందించాలని సిఫార్సు చేశారు. దీంతో వేదాంత కెయిర్న్‌ అధికారులు సిఎస్‌ఆర్‌ నిధులు రూ.30 లక్షలు విలువచేసే చేపల వేట వలలను సమకూర్చారు. వలలను శుక్రవారం మంత్రి విశ్వరూప్‌ మత్స్యకారులకు అందజేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్‌, మత్స్యశాఖ జెడి లాల్‌ మహమ్మద్‌, వేదాంత కెయిర్న్‌ అధికారి సతీష్‌, సిఎస్‌ఆర్‌ మేనేజర్‌ ఎండి పాషా, ఎఫ్‌డిఒ ఎన్‌.నాగమణి, వైసిపి నాయకులు జోగి రాజా, పొగాకు శ్రీను,లంకే శ్రీను తదితరులు పాల్గొన్నారు.