May 26,2023 23:55

డ్రైఫిష్‌ యార్డును ప్రారంభిస్తున్న మంత్రి సీదిరి

పశు సంవర్థక,మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- భీమునిపట్నం :
మత్స్యకారులు, మత్స్యకార్మికుల వలసల నివారణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, జెట్టీలు ఏర్పాటు చేస్తున్న ట్లు రాష్ట్ర పశు సంవ ర్ధక, మత్స్య , పాడి పరిశ్రమాభి వద్ది శాఖా మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం జివిఎంసి నాలుగో వార్డు బీచ్‌ రోడ్డు, చేపల తిమ్మా పురం వద్ద రూ. కోటి రూపాయలతో నిర్మించిన డ్రై ఫిష్‌యార్డును ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మత్స్యకారులు, మత్య కార్మికులు ఉపాధి కోసం గుజరాత్‌, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడిన సందర్భాలను గమనించిన సిఎం జగన్‌, వారి వలసల నివారణకు చేపట్టిన చర్యల్లో భాగమే ఈ ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ సెంటర్లు, జెట్టీల నిర్మాణమన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పూడిమడకలో రూ.360 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌, భీమిలి లో రూ.26 కోట్ల తో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, రాజయ్యపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ను రూ 150 కోటతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. వేటనిషేధ సమయంలో మత్స్యకారులకు ఆసరాగా ఉండేందుకు పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రాలోనే ఎక్కువగా రూ.పదివేల పరిహారం అందిస్తున్నామన్నారు. మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్టకు డీజిల్‌ సబ్సిడీ పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఆసక్తి ఉన్న మత్స్యకార సొసైటీలకు త్వరలో సెమీ ఆటోమేటిక్‌ ఫిష్‌ డ్రైయింగ్‌ మిషన్లు అందజేస్తామన్నారు. ఈ మిషన్‌ ద్వారా 2,3 డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారాలలో ఎండబెట్టిన చేపలు 24 గంటల వ్యవధిలోనే బయటకు వస్తాయన్నారు. వీటిని ఓజోనైజ్డు ప్యాకింగ్‌ చేస్తే ఎక్కువ మొత్తంలో విక్రయించే వీలుంటుందన్నారు. మత్స్యకారుల శారీరక శ్రమ కూడా తగ్గుతుందన్నారు. ఫిష్‌ ఆంధ్రా స్టాల్స్‌, అవుట్‌ లెట్స్‌ ఏర్పాటు ద్వారా మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. ఈ సందర్భంగా న్యాయపరమైన చిక్కులతో అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారుల ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించాలని వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు, స్థానిక మత్స్యకార నాయకులు మారుపిల్లి అమర్నాథ్‌, వాసుపల్లి నల్లబాబు తదితరులు మంత్రికి విన్నవించారు.
ముందుగా చేపల తిమ్మాపురం ది విశాఖపట్నం టౌన్‌ ఫిషర్‌ ఉమెన్‌ డ్రైఫిష్‌ కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మారుపిల్లి పార్వతమ్మ, మైలపల్లి ఎర్నమ్మ తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.కార్యక్రమంలో జెసి విశ్వనాథన్‌, ఆర్‌డిఒ ఎస్‌ భాస్కరరెడ్డి, విశాఖ, అనకాపల్లి జిల్లాల మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్లు జి విజయ, పి లక్ష్మణరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి కిరణ్‌కుమార్‌, ఎఫ్‌డిఒ డి లావణ్య, ఎపి మత్స్య శాఖ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు, ఫిషింగ్‌ హార్బర్‌ యూనియన్‌ అధ్యక్షులు వాసుపల్లి జానకీరామ్‌ పాల్గొన్నారు