
ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో మందులు కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్ లైన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు ఆదివారం డిమాండ్ చేశారు.పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 507వ రోజుకు చేరింది. పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్య్సకారులు ఆకులు, గడ్డి తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. హెటిరో డ్రగ్స్ మందుల కంపెనీ వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడంతో చేపలు మృత్యువాత పడడంతో వేటసాగక ఉపాధి కోల్పోయి ఈ విధంగా ఆకులు, గడ్డి తింటూ జీవించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ ప్రాంతంలో వేట సాగకపోవడంతో తమ కు జీవన ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వెలబుచ్చారు. చేపలు వేట తప్ప మరో వృత్తి తమకు తెలియదని ,కొత్త పైపు లైన్ వేసి తమ పొట్ట కొట్టొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల సోమేశ్వరరావు, పిక్కి రమణ, వాసుపల్లి సోమి, చేపలు సోమేష్, బొంది నూకరాజు, మైలపల్లి బాపూజీ, పిక్కి రాజు, మైలపల్లి నరేష్, కొత్వాల్ కాశీ, మైలపల్లి శివాజీ, చోడిపల్లి రాజు, పిక్కి సత్తిరాజు, మైలపల్లి దార్రాజు, పిడిమి తాతాజీ, తండేలా తాతాజీ తదితరులు పాల్గొన్నారు.