ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో కొత్తగా వేస్తున్న పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 451వ రోజుకు చేరింది. ఆందోళన శిబిరం వద్ద ఆదివారం పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు పచ్చి ఆకుల కొమ్మలు మెడలకు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పైప్ లైన్‌ను వ్యతిరేకిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 451 రోజుల నుండి పైప్ లైన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా పైప్‌లైన్‌కు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. వేట తప్ప మరో జీవన విధానం తమకు తెలియదని, పైప్‌లైన్‌కు అనుమతులు ఇచ్చి పొట్టపై దెబ్బ కొట్టొద్దన్నారు.ఇప్పటికే ఉన్న పైప్ లైన్‌తో మత్స్య సంపద నశించి పోవడంతో తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తే తమ బతుకులు ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పైపులైన్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు .లేనిపక్షంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల స్వామి, మైలపల్లి శివాజీ, చేపల రమేష్, పి.జగ్గా, కాశీరావు, కారే కోదండరావు, కొత్తవల జగ్గా పాల్గొన్నారు.










