Nov 20,2023 22:00

మత్స్యకారుల ఉపాధికేదీ భరోసా?

* తీరంలో కొరవడిన మౌలిక వసతులు
* జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీకి దిక్కులేని వైనం
* సంక్షేమ పథకాలకు సబ్సిడీ కుదించిన కేంద్రం
* నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జిల్లాలో 193 కిలోమీటర్ల మేర విశాలమైన సముద్రతీరం ఉంది. ఖనిజ తవ్వకాలు, అణుపార్కు, పోర్టు నిర్మాణం పేరుతో తీరం ఒక్కొక్క ప్రాంతం కార్పొరేట్‌ పరమవుతోంది. దీనికితోడు రసాయనిక, కాలుష్య కారక పరిశ్రమలు సముద్రంలోకి విడుదల చేసే వ్యర్థాలతో మత్స్య సంపద క్షీణిస్తోంది. ఇది చేపల వేటపై తీవ్ర ప్రభావం చూపి మత్స్యకారుల వలసలకు దారితీస్తోంది. కార్పొరేట్లకు తీర ప్రాంత భూములను కట్టబెడుతున్న ప్రభుత్వం జెట్టీలు కడతాం, హార్బర్లు నిర్మిస్తామంటూ మత్స్యకారులను ఊరిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలకు సబ్సిడీని కుదిస్తోంది. మత్స్యకార దినోత్సవాలను ప్రతి ఏడాదీ నిర్వహిస్తూ తామే వారి సంక్షేమ కోసం పాటుపడుతున్నట్లు మాట్లాడుతున్న పాలకులు ఆనక వారి బాగోగులను గాలికొదిలేస్తున్నాయి.
జిల్లాలో 11 తీర ప్రాంత ప్రాంత మండలాల పరిధిలో 104 గ్రామాలున్నాయి. జిల్లాలో 1,46,192 మంది జనాభా, 46,580 కుటుంబాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల కిందట వరకు ఇందులో 80 శాతం కుటుంబాలు చేపల వేటపై బతకగా, మిగిలిన 20 శాతం కుటుంబాలు వ్యవసాయం, ఇతర వృత్తులు, కూలి పనులు చేసుకునేవారు. ప్రస్తుతం మత్స్యకారుల జీవన స్థితిగతులన్నీ తారుమారు అయ్యాయి. ఇందులో చేపల వేటకు వెళ్తున్న వారి సంఖ్య 13 నుంచి 15 వేలు మాత్రమే ఉంది. చేపల వేట సరిగా సాగక వేలాది మంది మత్స్యకారులు గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ బోటు యజమానుల వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. గుజరాత్‌లోని ఒక్క వీరావల్‌ ప్రాంతంలోనే జిల్లాకు చెందిన మత్స్యకారులు సుమారు మూడు వేల మంది ఉన్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో చేపలు దొరక్కపోవడంతో వేలాది మంది మత్స్యకారులు ఏకంగా చేపల వేట మానుకుని ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. రోడ్డు వెంబడి టోపీలు, ఊయలలు అమ్ముకుని బతుకుతున్నారు. మరికొందరు పెయింటింగ్‌ పనులు చేస్తున్నారు. కొంతమంది గ్రామాల్లోనే ఉంటూ ఆటోలు, ప్రయివేట్‌ వాహనాలకు డ్రైవర్లుగా వెళ్తున్నారు. వేలాది మంది మత్స్యకారులు చేపల వేటకు దూరమవుతున్నారు.
ఫిషింగ్‌ హార్బర్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని 2020లో నిర్ణయించారు. ఇందుకోసం రూ.365.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. హార్బర్‌ నిర్మాణానికి 42 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. 2020లోనే భూసేకరణ పూర్తి చేశారు. ఇప్పటివరకు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగూ పడలేదు.
తీర ప్రాంతాల్లో కొరవడిన మౌలిక వసతులు
జిల్లాలో మత్స్య సంపదను నిల్వ చేసేందుకు ఎక్కడా కోల్డ్‌ స్టోరేజీలు లేవు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, రాళ్లపేటలో జెట్టీ, కవిటి మండలం ఇద్దివానిపాలెంలో జెట్టీ, సోంపేట మండలం బారువలో జెట్టీ, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుల-మంచినీళ్లపేట జెట్టీ నిర్మాణం పనులు ముందుకు కదలడం లేదు. గతంలో బారువ, నువ్వలరేవు తదితర తీరాల్లో ఏర్పాటు చేసిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
భారంగా చేపల వేట
జిల్లాలో మత్స్య సంపదను నిల్వ చేసేందుకు ఎక్కడా కోల్డ్‌ స్టోరేజీలు లేవు. పెరుగుతున్న డీజిల్‌ ధరలకనుగుణంగా సబ్సిడీ పెంచకపోవడంతో చేపల వేట మరింత భారంగా మారింది. ప్రధానంగా మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌ బోట్లకు వినియోగిస్తున్న డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడం ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర 98.97గా ఉంది. ప్రభుత్వం వీటికి లీటరుకు రూ.9 మాత్రమే ఇస్తోంది. అదీ నెలకు 300 లీటర్లను మాత్రమే ఇస్తోంది. డీజిల్‌ రూపంలో ఖర్చులు పెరగడంతో తమకు సగం కూడా మిగలడం లేదని మత్స్యకారులు చెప్తున్నారు. చేపలు దొరక్కపోతే ఒక్కోసారి డీజిల్‌ ఖర్చులూ రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
సంక్షేమ పథకాలకు కేంద్రం సబ్సిడీ కుదింపు
ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం 75 శాతం రాయితీ ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 40 శాతానికి కుదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, మహిళలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం మాత్రమే సబ్సిడీ అందిస్తోంది. ఆ పథకం కూడా మత్స్యకారులకు ఎందుకూ ఉపయోగపడడం లేదు. గతంలో వల యూనిట్‌ ఖరీదు రూ.రెండు లక్షలు ఉండగా, ప్రభుత్వం అందులో రూ.1.50 లక్షలు చెల్లించేది. మిగిలిన రూ.50 వేలు మత్స్యకారులు భరించేవారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత యూనిట్‌ ధరను రూ.ఐదు లక్షలు చేసింది. ఇందులో లబ్ధిదారుని వాటాగా మత్స్యకారులు రూ.మూడు లక్షలు చెల్లించాల్సి రావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో బ్లూ రివల్యూషన్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, లబ్ధిదారుడు 20 శాతం చెల్లించేలా మత్స్యకారులకు అమలు చేసిన పథకాన్ని ఆపేశాయి.