ప్రజాశక్తి- గాజువాక : గంగవరం మత్స్యకారులు ఇళ్లు, భూములు, సముద్ర వేటను త్యాగం చేసిన ఫలితంగానే గంగవరం పోర్టు నిర్మాణం జరిగిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ గుర్తుచేశారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష గురువారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఆర్‌కెఎస్‌వి.కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్, కార్యదర్శి బి.జగన్, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి కుమారమంగళం, జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వారి శ్రమను అదాని యాజమాన్యం దోచుకుంటుందన్నారు. కార్మికుల జీతాలు పెంచమంటే ఉద్యోగాలు తొలగిస్తూ నోటీసులు, వాయిస్ మెసేజ్‌లతో కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. ఈ పోరాటంలో కార్మికులు విజయం సాధిస్తారని స్పష్టంచేశారు. విశాఖపట్నం పోర్టులో కనీస జీతం రూ.36,400 ఇస్తున్నారని, ఇక్కడ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని సంప్రదింపులు ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు.
వైసిపి గాజువాక నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ, జీతాల కోసం అదాని గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి వైసిపి అండగా ఉంటుందన్నారు. సమస్యను ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, గంగవరం పోర్టులో 10.4 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాను నిర్వాసితులు, ప్రజల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అదానికి కట్టబెట్టిందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అండ చూసుకొని అదాని పోర్టు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. న్యాయవాది గంటా మోహన్, ప్రొఫెసర్ సూరప్పడు, సిపిఐ గాజువాక ఇన్‌ఛార్జి కసిరెడ్డి సత్యనారాయణ, సిఐటియు స్టీల్ జోన్ కార్యదర్శి కొవిరి అప్పలరాజు, వైసిపి మహిళా నాయకులు రోజారాణి, చిన్నతల్లి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పద్మ, శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లొల్లి తాతారావు, వాసుపల్లి ఎల్లాజీ, గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, పేర్ల నూకరాజు, కదిరి సత్యానందం, నొల్లి స్వామి, గంటిపిల్లి లక్ష్మయ్య, కొవిరి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.










