Nov 21,2023 23:39

మాట్లాడుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : సముద్ర తీరాన్ని రాష్ట్రానికి సంపదకేంద్రంగా మారుస్తూ మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 'ప్రపంచ మత్స్య దినోత్సవం' సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాదిగ కార్పొరేషన్‌ చైర్మర్‌ కొమ్మూరి కనకారావుతో కలిసి ఒంగోలు ఎంపీ హాజరయ్యారు. అనంతరం ఇద్దరు మత్స్యకారులకు ఒక్కొక్కటి రూ.20 లక్షల విలువైన (40 శాతం సబ్సిడీపై ) ఇన్సులేటెడ్‌ వాహనాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాగుంట నూట్లాడుతూ 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం రాష్ట్రానికి వరమన్నారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లను ఏర్పాటు చేయడం ద్వారా తీరప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతోపాటు వారి సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో కొత్తపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. మత్స్యకార భవన నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని ఎంపీ ప్రకటించారు. జడ్‌పి చైర్‌పర్పన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ బతుకుదెరువు కోసం ప్రకతి వనరులపై ఆధారపడుతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం పారదర్శకంగా పలు పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారని కొనియాడారు. మాదిగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ పొట్ట చేతపట్టుకుని ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి వేటకు వెళుతున్న మత్స్యకారుల జీవితాలలో ముఖ్యమంత్రి గణనీయమైన మార్పు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వివిధ వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి దైర్యంగా అమలు చేస్తున్నారన్నారు. సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మత్స్యకారుల పడవలకు లీటరుకు రూ.9 సబ్సిడీతో డీజిల్‌, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల బీమా, కెసిసి కార్డుల ద్వారా రుణాలు, ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌ లాంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరూ వీటిని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 2019-20 నుంచి 2023-24 వరకు ఈ పథకాల ద్వారా రూ.397 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఆళ్ల రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ కొత్తపట్నంలో రూ.392 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ను ఏర్పాటు చేయటంతో పాటు మత్స్యకారులకు అందుబాటులో ఉండేలా సచివాలయాల స్థాయిలో ఫిషరీస్‌ అసిస్టెంట్లను నియమించినట్లు తెలిపారు. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పెన్షను, సంక్షేమ, అభివద్ధి పధకాలను రాష్ట్ర ప్రభుత్వం పారర్శకంగా అనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సుమతి, మత్స్యకార సంఘం నాయకులు వాయల మోహన్‌ రావు, ఆప్కాబ్‌ న్యాయ సలహాదారు సైదా, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఉషాకిరణ్‌, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.