* ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: మత్స్యకారుల ఆర్థిక, జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,486 కోట్లు ఖర్చు చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని అమరావతి నుంచి సిఎం జగన్ మంగళవారం ప్రారంభించగా, కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదంలో 33 బోట్లు కాలిపోయిన సంఘటనలో మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి 80 శాతం నష్టపరిహారాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మత్స్యకార భరోసా సాయం కింద రూ.10 వేలు, డీజిల్ సబ్సిడీ లీటర్‌కు రూ.9, వేట చేస్తూ మరణిస్తే రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో జిల్లాలోని మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.
ఆక్వా ల్యాబ్ ప్రారంభం
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద రూ.35 లక్షల విలువ చేసే మొబైల్ ఆక్వా ల్యాబ్ రూ.14 లక్షల రాయితీతో, రూ.13.29 లక్షల విలువ చేసే చేపల సీడ్ రవాణా వాహనం రూ.8 లక్షల రాయితీతో, రూ.10 లక్షల విలువ చేసే ఫిష్ కియోస్క్ రూ.4 లక్షల రాయితీతో లబ్ధిదారులకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పంపిణీ చేశారు. మత్స్యకార భరోసా సహాయం కింద జిల్లాలో ఈ ఏడాది 15,281 మందికి రూ.పది వేలు చొప్పున రూ.1528.1 లక్షల సహాయాన్ని వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జెడి పి.వి శ్రీనివాసరావు, డిసిసిబి సిఇఒ వరప్రసాద్, మత్స్యకార సంఘ నాయకులు కోన నర్సింగరావు, ఆప్కాబ్ డైరెక్టర్ బర్రి తోటమ్మ, మైలపల్లి పోలీసు, వైస్ ఎంపిపి వంక రాజు, సొసైటీ అధ్యక్షులు సూరాడ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.