May 27,2023 00:18

నినాదాలు చేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో డ్రగ్స్‌ కంపెనీకి పైపు లైన్‌ వేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు శాంతియుతంగా తలపెట్టిన దీక్ష 541వ రోజుకు చేరింది. శుక్రవారం శిబిరం వద్ద మత్స్యకారులు పైపులైనుకు వ్యతిరేకంగా అర్థనగన ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, మత్య్సకారులు చేస్తున్న జీవన పోరాటంలో న్యాయం ఉందని, దీనిపై వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పైపు లైన్‌కు హెటిరో డ్రగ్స్‌ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే వేసిన పైపు లైన్‌తో ఉపాధి కోల్పోయి వలసలు పోతుంటే, రెండో అతి పెద్ద పైపులైను వేస్తే పూర్తిగా ఉపాధి కోల్పోయి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృతద్ధి పేరుతో ఈ విధంగా మత్య్సకారుల ఉపాధిని దెబ్బ తీసి, వారి జీవితాలను నాశనం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మత్య్సకారుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పైపులైను వేసుకోవడానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి నానాజీ, పిక్కి తాతీలు, గోసల స్వామి, చేపలు సోమేష్‌, వాసుపల్లి స్వామి, బొంది నూకరాజు, మైలపల్లి బాపూజీ, మైలపల్లి శివాజీ, కందాల నూకరాజు, చోడిపల్లి అప్పలరాజు, వాసుపల్లి నూకతాత పాల్గొన్నారు.