Sep 23,2023 00:34

నినాదాలు చేస్తున మత్స్యకారులు

ప్రజాశక్తి- నక్కపల్లి:బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నెల కొల్పొద్దని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో శుక్రవారం బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు నిరసన తెలిపారు. తమ ప్రాంతంలో రసాయన తుల్య పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తీర ప్రాంతాల్లో బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే తమ ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో చేపలు వేట సాగగా, ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డామని ఆవేదన వెలిబుచ్చారు. కాకినాడ ప్రాంతంలో అక్కడ ప్రజానీకం బల్క్‌ డ్రగ్‌ యూనిట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తే, ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.