Aug 05,2023 22:22

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

* పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- సోంపేట: 
మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి సిఎం జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. సోంపేటలోని ఒక ప్రయివేట్‌ కళ్యాణ మండపంలో మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియులతో జగనన్న మత్స్యకారుల సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో మత్స్యకారులు వేట సమయంలో మృతి చెందిన వారికి నష్టపరిహారం అందించలేదని అన్నారు. ప్రస్తుతం జగనన్న ప్రభుత్వంలో వేట సమయంలో మత్స్యకారులు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.పది లక్షలు నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు. వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం రూ.4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా చెల్లించిన దాఖలాలు లేవన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అండగా ఉంటుందని అన్నారు. జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ మాట్లాడుతూ తీర ప్రాంతంలో ఆధునిక వేట పద్ధతులు లేనందున ఇక్కడ మత్స్యకారులు చెన్నరు, గుజరాత్‌ వంటి సుదీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు. వారి కోసం ఇద్దువానిపాలెం, బారువ తదితర ప్రాంతాల్లో హార్బర్లు జట్టిలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నరసన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొన్నారు.