Oct 12,2023 21:13

జలాశయంలో చేప పిల్లలను విడిచిపెడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

ప్రజాశక్తి - కురుపాం :  మత్స్యకార రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గురువారం మండలంలోని గుజ్జువాయి పంచాయతీలో గల మంటికొండ జలాశయం వద్ద రూ.54 లక్షల ఫింగర్‌ జింగ్స్‌ సైజు చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం పెద్దగొత్తిలి సచివాలయం వద్ద జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల వద్దకే వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని, దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బిటి రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన
మండలంలోని మరిపల్లి నుండి నాగరగూడ వరకు 2.3 కిలోమీటర్ల రూ.కోటి 60 నిధులతో మంజూరైన బిటి రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. అనంతరం బియ్యాలవలస పంచాయితీ గుమ్మడి గూడ బిటి రోడ్డు నుండి షేకుపాడు వరకు 550 మీటర్లు రూ.46 లక్షలతో మంజూరైన బిటి రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి. సుజాత, మండల కన్వీనర్‌ ఐ.గౌరీశంకర్‌, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటీశ్వరరావు, వైస్‌ ఎంపిపిలు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.