ప్రజాశక్తి - చీరాల, బాపట్ల జిల్లా : అత్యధిక పోషకాలున్న మత్స్య సంపద ప్రజలకు చేరువయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె విజయ కృష్ణన్ తెలిపారు. మత్స్యశాఖ ద్వారా అమలవుతున్న పథకాలపై సంబంధిత అధికారులతో చీరాలలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్య సంపదను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో లభ్యమయ్యే మత్స్య సంపదను మన జిల్లా, రాష్ట్ర ప్రజలు సరిగా వినియోగించుకోవడం లేదన్నారు. అత్యధిక పోషకాలు ఉన్న మత్స్య సంపదను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ధరలు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. పొరుగు ప్రాంతాలకు మత్స్య సంపద ఎగుమతి అవుతుందన్నారు. జిల్లా ప్రజలే అధికంగా వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలో 70 యూనిట్లు స్థాపించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 33 యూనిట్లు మాత్రమే ప్రారంభించడంపై కలెక్టర్ ఆరా తీశారు. మిగిలిన యూనిట్లు ఈనెల 31లోపు ప్రారంభించాలని ఆదేశించారు. సూపర్ ఫిష్ యూనిట్లు రెండు స్థాపించగా, మిగిలిన 5 యూనిట్లు త్వరగా ప్రారంభించాలన్నారు. ఫిష్ కియాస్క్ యూనిట్లు ప్రస్తుతం రెండు ప్రారంభించగా, మిగిలిన 15 యూనిట్ లు త్వరలో ఏర్పాటు చేయాలన్నారు. లైవ్ ఫిష్ ఆటో యూనిట్లు ఇప్పటికే రెండు పంపిణీ చేయగా, మిగిలిన 9 యూనిట్లు లబ్ధిదారులకు త్వరగా అందించాలన్నారు. లాంజ్ ఫిష్ యూనిట్లు మూడింటిని లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి.సురేష్, మత్స్యశాఖ అభివద్ధి అధికారులు పాల్గొన్నారు.










