Oct 05,2023 01:05

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అవరణలో బాపట్ల పరిధిలోని మత్స్యకారులకు వైఎస్అర్ మత్స్య సాగు బడి పదకంపై మత్స్య సహాయకులు గొరికపూడి మరియదాసు, అంకిరెడ్డి అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి వివరించారు. మత్స్యకార స్టేట్ డైరెక్టర్ కన్నా మామిడియ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న 75శాతం సబ్సిడీని మత్స్యకారులు ఉపయోగించుకొని జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలని కోరారు. మత్స్యకారులకు గతంలో 40శాతం ఉన్న సబ్సిడీని 75శాతానికి పెంచటానికి మత్య్సశాఖ మంత్రి ఎంతో కృషి చేశారని తెలిపారు. కాబట్టి ఆయనకు ఎంతో ఋణపడి ఉన్నామని తెలిపారు. బాపట్ల మేరైన్ సిఐ సుబ్బారావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై అందిస్తున్న సముద్ర రక్షణ పరికరాలను తీసుకొని సురక్షితంగా వేట చేసుకుంటూ తద్వారా మీ జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఇంజిన్, బోటు, వల రూ.5లక్షల పథకానికి 40శాతం సబ్సిడీతో పాటు ఎఫ్‌డిఎస్ పథకం ద్వారా 35శాతంతో కలిపి మొత్తం 75శాతం సబ్సిడీతో కలిపి ఇస్తున్నారని తెలిపారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్లు, ఇన్లాండ్ సొసైటీ డైరెక్టర్ చేప సోమయ్య, సాగర్ పాల్గొన్నారు.