కాకినాడ ప్రతినిధి : మోడీ బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల విధానాలపై, దేశ ప్రజలను విడదీసే మతోన్మాదంపై పోరాడడమే స్వాతంత్రోద్యమ అమరవీరులకు మనమిచ్చే ఘన నివాళి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 12 గంటల వరకూ సాంసృతిక ఉత్సవాలు నిర్వహించారు. వీటిని డప్పు కొట్టి సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబీరాణి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సామ్రాజ్యవాద బ్రిటిషర్లతో పోరాడి స్వాతంత్రం సాధించి నేటికి 77 ఏళ్లు గడుస్తున్నా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టలేకపోయారన్నారు. మహిళలపై అత్యాచారాలను, గిరిజనులపై, దళితులపై, మైనారిటీలపై దాడులను బీజేపీ, ఆరెస్సెస్ మతోన్మాద సంస్థలు ప్రోత్సహిస్తూ కలిసున్న దేశప్రజల మధ్య విభేదాలను పెంచుతూ, భారత రాజ్యాంగ స్థానంలో మనుస్మతిని, ప్రజాస్వామ్యం స్థానంలో ఫ్యాసిస్టు విధానాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే కళారూపాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు దారపురెడ్డి క్రాంతి, షేక్ పద్మ, దళిత ఉద్యమ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, ఏపీఎమ్మెస్‌ఆర్యు రాష్ట్ర నాయకులు దుంపల ప్రసాద్, చివుకుల వెంకటరావు, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, కాకినాడ రూరల్ అధ్యక్షులు తానిషా, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు వర్మ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, నగర అధ్యక్షులు భారతి, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, జ్యోతి, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు, ప్రజానాట్యమండలి కాకినాడ పట్టణ కార్యదర్శి లోవరాజు పాల్గొని ప్రసంగించారు.










