ప్రజాశక్తి - కలెక్టరేట్
దేశంలో మతోన్మాదాన్ని ప్రతిఘటించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఐక్య విద్యార్థి ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక గిరిజన పోస్టుమెట్రిక్ బాలురు వసతిగృహంలో కమిటీ సభ్యులు స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో కూడిన ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.హరి మాట్లాడుతూ దేశంలో బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా, దేశానికి స్వాతంత్య్రం కావాలని, సమసమాజం రావాలని, విద్యా, ఉపాధి అవకాశాలు అందరికీ దక్కాలని కోరుతూ జాతీయోద్యమంలో విద్యార్థులు చేసిన పోరాటాలు, త్యాగాలు మరువలేనిదని, స్వాతంత్య్రం అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితాలు ఈనాడు కొద్దిమంది మాత్రమే అనుభవిస్తున్నారని అన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కలేదని, అసమానతలతో కూడిన భారతదేశంగా నేడు మిగిలిపోయిందని వాపోయారు. దేశ ప్రజల విముక్తికై బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టా లనే లక్ష్యంతో వివిధ విద్యార్థి, యువజన సంఘాలు నాయకుల వారసత్వంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిం దన్నారు. నేడు విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ పోరాటాల్లో విద్యార్థులంతా భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హాస్టల్ ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సభ్యులు నవీన్, సురేంద్ర, వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు.










