ప్రజాశక్తి - గోనెగండ్ల
ప్రస్తుతం దేశంలో మతోన్మాదాన్ని కొన్ని శక్తులు పెంచి పోషించి వ్యాపింపజేస్తున్నాయని, వాటి పట్ల విద్యార్థులు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండి తిప్పి కొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ నాయకులు డి.గౌస్‌దేశాయి కోరారు. గోనెగండ్లలోని మోడల్ పాఠశాల ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. చివరి రోజు మొదటి క్లాసు 'మతోన్మాదం - సమాజంపై దాని పాత్ర', రెండో క్లాసు 'సంఘ నిర్మాణం'పై గౌస్ దేశాయి విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొన్ని శక్తులు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం-2020 విద్యా రంగంలోని లోపాలను గుర్తించలేక పోయిందని విమర్శించారు. విద్యార్థులు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించడం, చరిత్రకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగించడం ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు ఉందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సామాజిక స్పృహ కలిగి నిబద్ధతతో మెరుగైన సమాజం కోసం పాటుపడాలని కోరారు. అనంతరం గోనెగండ్ల మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ షాహినా పర్వీన్, గోనెగండ్ల మాజీ ఉప సర్పంచి టి.రవికుమార్ నాయుడు మాట్లాడారు. విద్యార్థులు విద్యలో చక్కగా రాణిస్తూ క్రమశిక్షణతో మెలిగి ప్రభుత్వ పాఠశాలలు విద్యా రంగ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, మండల నాయకులు వీరన్న, ఖాజా, నంది, యుటిఎఫ్ నాయకులు నరసింహులు, రామన్, జిక్రియా పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ నాయకులు గౌస్ దేశాయి










