Oct 02,2023 23:27

నినదిస్తున్న కారెం వెంకటేశ్వరరావు, కెవిపిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి - అమలాపురం రూరల్‌
బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వన్నెచింతలపూడిలో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కెవిపిఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత, గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 4న 'చలో ఢిల్లీ'కి పిలుపునిచ్చారన్నారు. దళిత, గిరిజనుల పట్ల బిజెపి సర్కారు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్రపతికి పంపుతామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో 41 సిఆర్‌పిసి నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. అసైన్డ్‌ చట్ట సవరణ ఉపసంహరించాలన్నారు. కుటుంబానికి 2 ఎకరాలు భూ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేసారు. ఉపాధిలో 200 రోజులు పని కల్పించి, వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ చట్టానికి రూ.2 లక్షల కోట్లు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. కళ్యాణమస్తు పథకంలో దళితులకు పదో తరగతి విద్యార్హత నిబంధన తీసేయాలన్నారు. దళిత, గిరిజనులకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలనీ మొత్తం 21 డిమాండ్ల సాధన కోసం సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమాల శ్రీను, కె.ప్రణీత్‌సాయి, బి.ధోని, పి.బాలయోగి, పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టు వద్ద కెవిపిఎస్‌ జెండాను యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు, జెవివి జిల్లా ఉపాధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ి కెవిపిఎస్‌ మండల గౌరవ అధ్యక్షులు జి.దుర్గాప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. బిజెపి హయాంలో దళితులు, గిరిజనులు, మహిళల హక్కులను హరించేస్తున్నారన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకుండా వైసిపి సర్కారు దళితులకు ద్రోహం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల న్నారు. ఈ కార్యక్రమంలో ఉండ్రుర్తి ప్రసాద్‌, రేవు శ్రీనివాసరావు, ఎన్‌.వెంకటేష్‌, జె.జనార్థన్‌రావు, రాపాక హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.