Sep 03,2023 18:12

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మతోన్మాద బిజెపిని సాగనంపాలని కోరుతూ ఆదివారం ఐదో రోజు సిపిఎం తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమరభేరి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 35వ వార్డులో, ఎస్‌విఆర్‌ విగ్రహం నుంచి పెంటపాడు వరకూ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఈ నెల నాలుగో తేదీన మండల కార్యాలయాల వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని పట్టణ ప్రజలను కోరారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదని విమర్శించారు. స్వాతంత్య్రోద్యమంలో కనీస పాత్రలేని వారు దేశాన్ని పాలించడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సోమవారం మండల కార్యాలయాల వద్ద జరగబోయే ధర్నాలో పట్టణ ప్రజలంతా పాల్గొని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, దేశం నుండి బిజెపిని తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మడకా రాజు, జవ్వాది శ్రీను, శిద్ధిరెడ్డి శేషుబాబు, పోతు శ్రీను, గొర్రెల వంశీ పాల్గొన్నారు.
తణుకు రూరల్‌ : అధిక ధరలు, నిరుద్యోగం తదితర సమస్యలపై తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం 4న జరిగే ధర్నాలో ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని సిపిఎం పట్టణ కమిటీ పిలుపు నిచ్చింది. ఆదివారం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధరలు, నిరుద్యోగంపై సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే అన్ని పార్టీలకూ ప్రజలు గుర్తుకొస్తారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికార పార్టీకి విన్నవించినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. నేటికీ ప్రజలను కేవలం ఐదు సంవత్సరాలకోసారి వచ్చే ఓటు బ్యాంకుగా చూస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు గానీ, వారి జీవన ప్రమాణాలు గానీ, వారిపై పడుతున్న భారాలు గానీ ఆలోచించే ఓపిక, సహనం పాలకులకు లేకపోవడం అన్యాయం అన్నారు. ప్రజలు పక్షాన పని చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, రాజశేఖర్‌, సుగుణరావు, శ్రీను, పద్మారావు, ముత్యాల రావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.