
జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - ఆచంట
రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించడమే సిపిఎం ప్రధాన లక్ష్యమని పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. ఆచంట వేమవరంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎస్‌విఎన్.శర్మ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బలరాం పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రాల ఆర్థిక వనరులను లాక్కొని, హక్కులను కాలరాస్తూ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజలందరి శతృవని, ఈ శతృవును ఓడించడానికి దేశంలోని రాజకీయ పక్షాలు, ప్రజలంతా కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలుపర్చలేదని విమర్శించారు. కార్పొరేట్, బడాబాబులకు దాదాపు రూ.12 లక్షల కోట్లు రుణమాఫీ చేసి దేశ ప్రజల సంపదను దోచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కుల, మతాలు, ప్రాంతాలే కాకుండా తెగల మధ్య కూడా చిచ్చు పెట్టి చలికాచుకుంటోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు, విభజన హామీలు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈ సమస్యలన్నింటిపై కలిసొచ్చే అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని రాబోయే కాలంలో దేశంలో, రాష్ట్రంలో పేద, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ప్రజా ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించనున్నామని, ఈ పోరాటాలన్నింటిలో ప్రజానీకం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, పోడూరు, పెనుగొండ మండలాల కార్యదర్శులు పిల్లి ప్రసాద్, సూర్నీడి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, గుత్తుల రంగారావు, కుసుమే జయరాజు, మచ్చా సుబ్బారావు పాల్గొన్నారు.