ప్రజాశక్తి - బుట్టాయగూడెం
దేశంలోని మతోన్మాద బిజెపి విధానాలు తిప్పికొట్టాలని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.లింగరాజు తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 2, 3 తేదీల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల క్లాసులు సోమవారం మండలంలోని జైనవారి గూడెంలో ప్రారంభమైయ్యాయి. ఈ క్లాసులు సూచికగా పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు కారం మల్లేశ్వరరావు జెండా ఎగరవేసి క్లాసులు ప్రారంభించారు. అనంతరం లింగరాజు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద విధానాలు చాప కింద నీరు లాగా ప్రవశిస్తూన్నాయని, ప్రజల్లోని మత విద్వేషాలు రెచ్చగొట్టి చీలికలు తీస్తున్నాయని వారు విమర్శించారు. మతోన్మాద బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విధానాల్ని ప్రజలు తిప్పి కొట్టే విధంగా సిద్ధం కావాలని కోరారు. ఈ క్లాసుల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మొడియం నాగమణి, మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, నాయకులు తెల్లం దుర్గారావు, మానుకొండ జీవరత్నం, గూడేల్లి వెంకట్రావు పాల్గొన్నారు.










