Nov 07,2021 12:52

ఓ వైపు కరోనా భయంతో రెస్టారెంట్స్‌కు వెళ్లాలంటేనే వెన్నులో వణుకొస్తుంది. మటన్‌ రోజూ ఇలానేనా..! డిఫరెంట్‌గా వండు అనే కుటుంబ సభ్యులు. అటువంటి మాంసాహార ప్రియుల కోసం రెస్టారెంట్‌ స్టైల్‌లో మటన్‌ స్పెషల్స్‌ ...

                                                      ములక్కాయతో..

మటన్‌తో మజాగా..

కావాల్సిన పదార్థాలు : నూనె- 2 స్పూన్లు, ములక్కాయ ముక్కలు -15, మటన్‌ - కేజీ, పెద్ద ఉల్లిపాయముద్ద - కప్పు, టమోటా ముద్ద - కప్పు, పచ్చిమిర్చి -4, లవంగాలు -5, యాలకులు -3, దాల్చిన చెక్క -పెద్దముక్క, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ -2 స్పూన్లు, గరంమసాలా- 2 స్పూన్లు, ధనియాల పొడి - టీస్పూను, మటన్‌ మసాలా -2 స్పూన్లు, జీలకర్ర - టీస్పూను, పసుపు- 1/2 స్పూను, ఉప్పు -తగినంత, కారం-2 స్పూన్లు, కొత్తిమీర- 2 కాడలు, కరివేపాకు- 2 రెబ్బలు లేదా 10 ఆకులు, పుదీనా -10 ఆకులు, నిమ్మరసం - టీస్పూను, ఎండు కొబ్బరిపొడి -2 టీస్పూన్లు.
 

తయారుచేసే విధానం :
ముందుగా మటన్‌ శుభ్రం చేసుకుని, చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్కను మటన్‌ ముక్కల్లో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
కుక్కర్‌ స్టవ్‌ మీద పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ముందుగా సిద్ధంచేసి పెట్టుకున్న మటన్‌ ముక్కలు వేసి, ఐదు నిమిషాలు వేయించాలి.
ముక్కల్లోని నీరు బయటికి రావటం మొదలయ్యాక, మరోకప్పు నీరు ముక్కలు కొంచెం మునిగే వరకు పోసి, మూతపెట్టి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచి, స్టవ్‌ ఆఫ్‌ చేయాలి.
మరోపాన్‌లో నూనె కాగాక జీలకర్ర, కరివేపాకు వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించి, ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ వేసి మూడు నిమిషాలు వేయించాలి.
తర్వాత ములక్కాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు చల్లాలి. ఐదు నిమిషాల పాటు ముక్క కొంచెం మెత్తబడే వరకు మూతపెట్టి మగ్గనివ్వాలి.
తర్వాత టమాటో పేస్ట్‌, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి తక్కువమంట మీద ఉంచి, నూనె బయటికి వచ్చే వరకు ఉడికించాలి.
అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ ముక్కలు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. కుక్కర్‌లో మటన్‌ ఉడికించగా మిగిలిన నీటిని కూడా కూరలో పోసేయాలి.
తర్వాత ఎండుకొబ్బరి పొడి, మటన్‌ మసాలానూ వేసి, మరో పావుగంట కూర దగ్గరపడే వరకు ఉంచి దించేయాలి. చివరగా కొంచెం నిమ్మరసం వేసి, కలయబెట్టి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

                                                                 లుక్మీ

మటన్‌తో మజాగా..

కావాల్సిన పదార్థాలు : మటన్‌ ఖైమా - 200గ్రా, ఉల్లిపాయలు - 20గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కారం - 15గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, పసుపు - 5గ్రా, నూనె - 400ఎంఎల్‌, మైదా - 100గ్రా, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - 15గ్రా, నెయ్యి లేదా డాల్డా - 25గ్రా.
 

తయారుచేసే విధానం :
మటన్‌ ఖైమాలో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మారినేట్‌ చేసుకోవాలి.
స్టవ్‌పై పాన్‌ పెట్టి అందులో నూనె వేయాలి. అది వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి, గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
తరువాత మారినేట్‌ చేసుకున్న మటన్‌ వేసి, చిన్నమంటపై ఉడికించాలి. దానిపై ధనియాల పొడి, గరంమసాల చల్లి దింపాలి.
ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని అందులో నెయ్యి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి, మెత్తటి మిశ్రమంలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వెడల్పుగా ఒత్తుకోవాలి. మధ్యలో మటన్‌ మిశ్రమం పెట్టి, మరో లేయర్‌తో మూసేయాలి. నీళ్లు అద్దుతూ చివరలూ మూయాలి.
వీటిని చిన్నమంటపై నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా తింటే మటన్‌ లుక్మీ రుచిగా ఉంటుంది.

                                                        చింతచిగురుతో..

మటన్‌తో మజాగా..

కావాల్సిన పదార్థాలు : కొబ్బరిపొడి- సగం కాయది, కొత్తిమీర- 1/2 కప్పు, ధనియాల పొడి- 2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు- 2 స్పూన్లు, జీలకర్ర- 1/2 స్పూను, పుదీనా- కొద్దిగా, ఆవాలు- 1/2 స్పూను, మటన్‌- 1/2 కేజీ, నూనె-తగినంత, ఉల్లిపాయ ముక్కలు- 300గ్రా, మిరప్పొడి- ఒకటిన్నర స్పూను, ఉప్పు- రుచికి తగినంత, చింత చిగురు- అరకిలో, పసుపు- పావుస్పూను, గరం మసాలా- స్పూను.
 

తయారుచేసే విధానము :
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, గరం మసాలా వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి.
తర్వాత పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి వేగనివ్వాలి.
అందులోనే కొబ్బరిపొడి, మటన్‌ ముక్కలు, పుదీనా వేసి తగినంత నీటిని పోసి కలపాలి.
తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
మటన్‌ ఉడికిన తర్వాత చింతచిగురు, కొత్తిమీర వేసి సమంగా కలిసే వరకు కలియబెట్టాలి.
మరో ఐదు నిమిషాలపాటు మటన్‌ పొడిగా వచ్చే వరకూ ఉడికించాలి. అంతే రుచికరమైన చింత చిగురు మటన్‌ ఫ్రై రెడీ..