Mar 07,2021 14:23

సోమనాథ శాస్త్రి గారింట్లో వాతావరణం చాలా వేడిగా ఉంది. వేడిగా ఉండదా? కొడుకు డాక్టర్‌ అజరు శాస్త్రి తక్కువ పనిచేశాడా? పోయి పోయి ఎవరూ దొరకనట్లు తురక పిల్లను చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. బ్రాహ్మణులే అయినా వేరే శాఖ సంబంధాలొస్తే, అవి ఎంత గొప్పవయినా వద్దు పొమ్మనేవారు శాస్త్రి గారు. అటువంటి శాస్త్రి గారు ఇది సహిస్తారా? శాస్త్రిగారి కోపం అందరికి తెలిసిందే కదా! తమ్ముడు శివుడు, బావమరిది కేశవ, భార్య అనసూయ, కూతురు యశోధర భయంతో గజగజలాడుతుంటే, అజరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ధీమాగా ఉన్నాడు. నువ్వు తొందరగా రా! మనిద్దరమే శాస్త్రిగారికి కాస్త నచ్చజెప్పాలి. స్నేహితులం కదా, మన మాట వినవచ్చు' అంటూ ఫోన్లో నెమ్మదిగా మాట్లాడాడు వాసుదేవ్‌, తన మిత్రుడు జనార్ధన్‌తో.


ఐదు నిమిషాల్లో జనార్ధన్‌ అక్కడికి వచ్చి వాలాడు. ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు నిశ్శబ్దంగా. ఏ వేళనయినా స్వతంత్రంగా ఇంట్లోకి అడుగుపెట్టే చనువుంది వారిద్దరికీ. ఉగ్రరూపం ఎత్తిన శాస్త్రి గారిని పలకరించడానికి వాళ్ళిద్దరికీ ధైర్యం సరిపోలేదు. కానీ వాళ్ళిద్దరినీ చూడగానే, అనసూయకు మాత్రం ధైర్యం వచ్చింది.


అజరు అంతగా ఇష్టపడే అమ్మాయి పేరు హనీ. అసలు పేరు హసీనా. యశోధర క్లాస్‌మేట్‌. వాళ్ళిద్దరిదీ గాఢమైన స్నేహం. అందువల్ల హనీ తరచూ శాస్త్రి గారింటికి వస్తూ పోతూ ఉంటుంది. చాలా తెలివైనదీ, చురుకైనదీ కావడం వల్ల ఆమె అంటే శాస్త్రి గారికి చాలా ఇష్టం.
'నా ఇంట్లో ఎందుకు పుట్టలేదు నువ్వు?' అని తరచూ ఏదో సందర్భంలో అంటూ వుండేవారు. 'వచ్చే జన్మకి రిజర్వేషన్‌ చేసుకుంటాను అంకుల్‌' అంటూ కిల కిలా నవ్వేది.
చాలాకాలం వరకు ఆమె అజరు కళ్ళబడలేదు. అజరు చదువు కారణంగా, అతను ఎక్కువగా వేరే చోట్ల ఉండడం వల్ల వాళ్లిద్దరూ కలుసుకునే అవకాశం కుదరలేదు. పిజి పూర్తిచేసుకుని, స్వంత ఊరిలోనే ఉద్యోగం సంపాదించాక అతనికి ఆమెను కలిసే అవకాశం వచ్చింది. లేత గులాబీ పువ్వులా వున్న హనీ అతన్ని మొదటి చూపులోనే ఆకర్షించింది. ఆమె తెలివితేటలు, నమ్రత, సంస్కారం అతనికెంతో నచ్చాయి. శాస్త్రి గారిని ఒప్పించే పెళ్లి చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు వాళ్ళి ద్దరూ. ఆయనకు తప్ప ఇంట్లో వాళ్లందరికీ హనీ అంటే ఇష్టమే. అజరు, అనసూయ, యశోధర ఎంత ప్రయత్నించినా శాస్త్రిగారు దిగిరాలేదు. అయితే వాసుదేవ్‌, జనార్ధన్‌లు చొరవ తీసుకుని గట్టిగా పట్టుబట్టడంతో, అయిష్టంగానే శాస్త్రిగారు పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది. కానీ హనీని కోడలిగా స్వీకరించలేనని మొండికేశారు. కొన్నాళ్ళకు ఆయన మనసు మారుతుందని ఆశ పడుతూ కోడలిగా ఆ ఇంటి గడప తొక్కింది హనీ.
 

***
'ఏదో కష్టపడి ఆ అమ్మాయిని ఇంటి కోడలిగా చేసేశాం గానీ, శాస్త్రి గారిలో ఏ మార్పూ లేదు. పెళ్లికాకముందు ఎంతగానో అభిమానించే ఆ అమ్మాయిని, ఇప్పుడాయన ఒక శత్రువులా చూడడం భరించలేక పోతున్నారు అందరూ. ఏడాది కావస్తున్నా, ఆయన మనసు కరగనందుకు ఆ పిల్ల బాధపడని క్షణమంటూ లేదు. ఏమిటో! వాళ్లింట్లో మంచి రోజులు ఎప్పుడొస్తాయో?' అంటూ తన బాధను వెళ్ళగక్కాడు వాసుదేవ్‌, జనార్ధన్‌ ముందు. మౌనంగా విని ఊరుకోవడం తప్ప జనార్ధన్‌ ఏమీ బదులివ్వలేకపోయాడు.
వాళిద్దరి మధ్య ఆ సంభాషణ జరిగిన కొంత కాలానికి ఆ ఇంటిలో కొన్ని మార్పులొచ్చాయి. తీవ్ర అశాంతితో బాధపడుతున్న శాస్త్రి గారికి ముందు నుంచీ ఉన్న డయాబెటిస్‌ వ్యాధి చాలా ఇబ్బంది పెట్టడం మొదలయ్యింది. షుగర్‌ లెవెల్స్‌ బాగా పెరిగాయి. కొడుకు మీద కోపంతో, చికిత్సకు సహకరించేవారు కాదు. అనారోగ్యం ఆయనలో అశాంతిని మరింత పెంచేది. ఆయనకీ పరిస్థితికి రావడానికి తనే కారణమని హనీ విలవిలలాడేది. ఆయన ఆరోగ్యం కుదుటబడాలని రోజూ అల్లాను ప్రార్ధించేది. భర్త, అత్తగారు, ఆడపడుచు చూపే ప్రేమాభిమానాలు ఆమెకు ఊరట కలిగించేవి. మరో ఏడాది గడిచేసరికి, శాస్త్రిగారిలో మెల్లగా మార్పు వచ్చింది. హనీని ఆయన ప్రేమగా చూడడం మొదలు పెట్టారు.
అలా ఈ ఇంట్లో ప్రశాంతత వచ్చింది గానీ బయట అశాంతి మొదలయింది.
 

***
శాస్త్రి గారింటిలో కాలనీవాసుల సమావేశం మొదలైంది. శాస్త్రిగారు అందరినీ ఉద్దేశించి, చెప్పడం మొదలుపెట్టారు.
'నేను చెప్పబోయే విషయం మీలో చాలామందికి తెలుసు. అయితే తెలియని వారూ ఇక్కడున్నారు కనుక, వివరంగా చెప్తాను. మన కాలనీలో ఎనిమిది వీధులు, నూట ఏభై వరకూ ఇళ్లున్నాయి. అందులో కేవలం రెండిళ్లలోనే ముస్లింలు, ఫరీద్‌, అన్సారీలు నివాసముంటున్నారు. మిగిలిన కాలనీ అంతా హిందువులే. చివరి వీధిలో నివాసముంటున్న ముస్లింలకు, మనకు ఎప్పుడూ స్నేహమే తప్ప, విబేధాలుండేవి కాదు. మన ఫంక్షన్లకు వారు, వాళ్ళ ఫంక్షన్లకు మనం వెళ్లడం ఎప్పుడూ జరుగుతుండేది. ఎన్నో ఏళ్లుగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మన కాలనీలో ఇప్పుడు చిచ్చు మొదలైంది. ఆ ఇద్దరి ముస్లింల ఇళ్ళు తప్ప చివరి వీధిలోని ఇళ్ళన్నీ, పెద్ద పలుకుబడి గల రాజకీయ నాయకుడు 'శ్రీరాం' వశమైపోయాయి. ఆ రెండిళ్ళూ కొనేసి, ఆ వీధంతా స్వంతం చేసుకోవాలని పట్టుపట్టాడు శ్రీరాం. ఫరీద్‌, అన్సారీలు వాళ్ళ ఇళ్లు అమ్మడానికి ఒప్పుకోలేదు. శ్రీరామే స్వయంగా వచ్చి అడిగితే, తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని, కదలలేమని వినయంగా చెప్పారు. దాంతో శ్రీరామ్‌ వాళ్లను రకరకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ప్రభుత్వం, పోలీసులు అతని పక్షాన ఉండడంతో అతని ఆగడాలకు అంతులేకుండా పోయింది. అయితే వాళ్ళిద్దరూ దేనికీ లొంగలేదు. దాంతో శ్రీరాం కసి పెరిగింది. పార్కుకు కేటాయించిన ప్రభుత్వ భూమిని, వాళ్ల పూర్వీకులు ఎప్పుడో ఆక్రమించుకున్నారని, తప్పుడు కేసు పెట్టి, మూడుసార్లు లాకప్‌లో పెట్టించాడు. వాళ్ల దగ్గరున్న డాక్యుమెంట్లు చూపించినా న్యాయం జరగలేదు. ఒక పక్క కోర్టు కేసు అవుతుండగానే, వాళ్ళ ఇళ్లను బుల్డోజరుతో కూల్చేశారు. లబోదిబోమంటూ వాళ్ళు, కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, మీడియా ముందు తమ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే, మా గుండెలు తరుక్కుపోయాయి. నేను, వాసుదేవ్‌, జనార్ధన్‌ వాళ్లకు అండగా నిలబడ్డాం. అయితే ఇప్పుడు మీరందరూ సహకరిస్తేనే, శ్రీరాంని ఎదుర్కొని, ఆ కుటుంబాలను కాపాడగలుగుతాం!' అంటుండగానే, అందరూ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట ఇచ్చారు. శాస్త్రి గారికి, ఆయన మిత్రులకు ఎంతో ఆనందం కలిగింది. జనం సపోర్ట్‌తో వాళ్ళకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది.
'సమాజంలో మతోన్మాదం పెరిగిపోయినా, మానవత్వం ఇంకా మిగిలి ఉందని రుజువుచేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు నుంచి ఆ రెండు ముస్లిం కుటుంబాలకు, వేరే సదుపాయం దొరికేవరకూ మా ఇంట్లోనే ఆశ్రయమిస్తాను. మా ఇంటిలో మాంసాహారం దొరకదు కాబట్టి, ఆ ఏర్పాటేదో మీరే చెయ్యాలి మరి' అంటూ వాసుదేవ్‌, జనార్ధన్ల వైపు నవ్వుతూ చూశారు శాస్త్రిగారు. వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ తమ అంగీకారాన్ని తెలియజేస్తూ తలూపారు.
'ఫుడ్‌ విషయం మేము చూసుకుంటాం. వాళ్లకు ఏ ఇబ్బందీ రానివ్వం' అని మరో నలుగురైదుగురు అన్నారు. మిగిలిన వాళ్లు వత్తాసు పలికారు. వాళ్లందరికీ శ్రీరాం మీద మంటగా ఉన్నా, అతనికి భయపడి ఇంతవరకూ ఏమీ చేయలేక పోయారు. ఇప్పుడు కలిసికట్టుగా తిరగబడాలనే సంకల్పం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.

***
హనీ కుటుంబం, అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో, ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉన్న మీర్జాపేటలో నివాసముంటుంది. అక్కడ ముసలం మొదలయ్యింది. ఫరీద్‌, అన్సారీలకు జరిగిన అన్యాయానికి అక్కడి యువకుల రక్తం వేడెక్కింది. శ్రీరామ్‌తో రాజకీయ శత్రుత్వం గల, వాళ్ళ నాయకుడు యూసఫ్‌ఖాన్‌ ఆ అవకాశాన్ని, చక్కగా ఉపయోగించుకుంటూ, యువతను బాగా రెచ్చగొట్టి, అగ్నికి ఆజ్యం పోశాడు. హిందువులంతా తమకు శత్రువులే అని బాగా నూరిపోశాడు. శ్రీరాంమీద కోపంతో హిందువులమీద విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు రెచ్చిపోయిన కొందరు ముస్లిం యువకులు. దానికి బదులుగా హమీద్‌, అన్సారీల కుటుంబాలను, కాలనీ దగ్గరలో ఉన్న ముస్లిం కుటుంబాలను అంతమొందించాలని అక్కడి హిందూ యువకులు రెచ్చిపోతున్నారు. శ్రీరామ్‌ వాళ్ళను మరింత ఉద్రేకపరిచాడు. 'జై శ్రీరాం' అనే కేకలతో, పొడవైన కత్తులు పట్టుకొని తిరుగుతున్న తమ కొడుకులను ఆపలేకపోవడమే కాక, వాళ్ళకే భయపడే రోజులొచ్చాయి.


ఇది ఇలా ఉండగా హనీ నెల తప్పింది. శాస్త్రి గారు ఆమెను శివాలయానికి తీసుకెళ్ళి అభిషేకం చేయించి పుట్టబోయే బిడ్డకు శివుడి దీవెనలు అందించాలనే కోరికను వెలిబుచ్చారు. హనీ శాస్త్రిగారి కోరికను వెంటనే అంగీకరించింది. అత్తారింటికి వచ్చాక, నమాజ్‌ చెయ్యడానికి అవకాశంలేక, చాటుగా అల్లాను ప్రార్థించే అలవాటు ఉన్న హనీ, 'ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌' అనుకుంటూ ఈశ్వరుడిని దర్శించడానికి బయల్దేరింది. పూజ అయిపోయిన తర్వాత, గుడి నుంచి బయటకొస్తున్న వారిద్దరికీ 'జై శ్రీరాం' అనే అరుపులు, పెద్ద కోలాహలం వినిపించాయి. శాస్త్రి గారి ముఖంలో కొద్దిపాటి కలవరం కనిపించింది. హిందువుల కోడలిగా తనకు రక్షణ ఉంటుందనే ధైర్యం ఉన్నా, హనీకి గాభరా మొదలైంది. టెన్షన్‌తో ఇద్దరూ అడుగులు వేస్తుంటే, ఆ గుంపు ఎదురైంది. వాళ్లలో సగం మంది శాస్త్రిగారి దగ్గర చదువుకున్నవాళ్లే కావడంతో, ఆయన పెద్దగా కంగారు పడలేదు. కానీ పరిస్థితి వాళ్లకు ప్రతికూలంగా మారింది.


'ఈ పంతులు హిందూ వ్యతిరేకి, అందుకే తురకపిల్లను కోడలిగా తెచ్చుకున్నాడు. ఆ ఇద్దరు తురక నాకొడుకులను ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. మిగిలిన హిందువులను చెడగొడుతున్నాడు. చంపేయండిరా వీళ్ళిద్దరిని' అంటూ పిచ్చెక్కినట్లు అరుస్తున్న ఒకడికి, వంత పలుకుతున్నట్లు, మిగిలిన వాళ్లలో చాలామంది అరిచారు. దాంతో వాతావరణం బాగా వేడెక్కింది. పాతరోజుల్లో శాస్త్రి గారికి ఎదురుపడ్డానికి భయపడే కుర్రకారు ఇలా విజృభించడం చూస్తే ఆయనకు మతిపోయింది. ఆ గుంపులో శ్రీరాం మనుషులున్నారన్న విషయం తెలిసిపోతూనే ఉంది. వాళ్ళ అరుపులకు, కేకలకు గుడిలోంచి బయటకొచ్చిన జనం, జరగబోయే అఘాయిత్యాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఆ జనంలో జనార్ధన్‌, వాసుదేవ్‌ కూడా ఉన్నారు.


'తండ్రి లాంటి వారిని, మీకు చదువుచెప్పిన గురువుని చంపాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా?' అంటూ కేకలు పెట్టాడు జనార్ధన్‌. ఎన్నో సందర్భాలలో శాస్త్రిగారు, ఆ గుంపులో ఉన్న చాలామంది కుర్రాళ్ళ కుటుంబాలకు సహాయం చేశారు. ఆ కుర్రాళ్ళ తండ్రులూ చుట్టూ చేరిన జనంలో ఉన్నారు. ఆయన మీద కత్తి దూసిన, కృతఘ్నులైన తమ పుత్రరత్నాలను కట్టడి చేయడానికి వారెంతో ప్రయత్నించారు. శాస్త్రి గారు తమకే కాక ఎందరికో సాయం చేసిన సందర్భాలు గుర్తుచేశారు. శాస్త్రిగారే లేకపోతే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవో అర్థమయ్యేలా తెలియజెప్పారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. కాలనీలోని యువకుల్లో కొంత మార్పు వచ్చింది. ఆ గుంపు రెండు వర్గాలుగా చీలిపోయింది. శాస్త్రి గారిని చంపడానికి కొంతమంది ఒప్పుకోలేదు. హనీని చంపేయడానికి మాత్రం అందరూ సిద్ధమయ్యారు.


'ఒరే నాయనలారా.. అది ఇప్పుడు వట్టిమనిషి కాదురా. దాని కడుపులో మన హిందూయే పెరుగుతున్నాడురా! దయచేసి వదిలిపెట్టేయండిరా' అంటూ ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఆ పెద్దమనిషి బతిమాలుతుంటే చుట్టూ ఉన్న జనం కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన మాటలకు వెటకారంగా నవ్వి, 'కాదు.. కాదు.. దాని కడుపులో పెరుగుతున్నది మరో ముస్లిం. భలే ఛాన్స్‌ రా! ఒక దెబ్బకు రెండు పిట్టలు. వేసేయండిరా దాన్ని!' అంటూ పురికొల్పాడు శ్రీరాం అనుచరుడు. కత్తులు పైకెత్తి 'జై శ్రీరాం' అంటూ దాడికి సిద్ధమయ్యారు. 'తన ప్రాణాలు ఫణంగా పెట్టయినా హానీ ప్రాణాలు కాపాడుకోవాలి, ఎలా? ఎలా?' అనుకుంటూ మధనపడుతున్న ఆయనకు, ఏ దారీ దొరకలేదు. ఏ దిక్కూ తోచలేదు. ఈలోగా, ముస్లింల చేతుల్లో బలి అయిపోయిన హిందువులను గుర్తుచేస్తూ, కాలనీ యువతను రెచ్చగొట్టడంలో విజయవంతమయ్యారు శ్రీరాం అనుచరులు. దాంతో కాలనీ యువకులు మరింత రెచ్చిపోయారు. శ్రీరాం అనుచరుల ప్రభావం లేకపోతే చుట్టూ చేరిన జనం, ఏ ఘోరమూ జరక్కుండా ఆపగలిగేవారేమో! కానీ ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది.


వాళ్లకు నచ్చజెప్పడానికి శాస్త్రి గారు చెయ్యని ప్రయత్నం లేదు. అయితే వాళ్ళు తనను చంపరనే ధైర్యం మాత్రం వచ్చిందాయనికి. పరిస్థితి ఎలా మారిందంటే, శ్రీరాం అనుచరులు ఆయనకేమైనా హాని తలపెట్టే ప్రయత్నం చేస్తే, కాలనీ కుర్రాళ్ళు వాళ్ళను శుభ్రంగా చితగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారిప్పుడు. అది శాస్త్రిగారికి కలిసొచ్చింది. గతంలో తన వల్ల చాలా పెద్ద సహాయం పొందిన అరుణ్‌ని బతిమాలి, కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేశారు. అది ఫలించక పోయేసరికి, అరుణ్‌ చేతిలో కత్తి లాక్కొని, దూరంగా జరిగి, కత్తిని తన మెడకానించి, 'హనీ మీద ఈగ వాలినా నేను పీక కోసుకుని చస్తాను!' అంటూ బెదిరించారు. దాంతో అందరూ బిక్క చచ్చిపోయారు. అంతవరకు శాస్త్రి గారిని అంతమొందిద్దామనుకున్న ఆయన శిష్యులు, కళ్ళు తెరిచారు.


వెంటనే అందరూ తేరుకొని, 'వద్దు గురువు గారూ! ఆ పనిచెయ్యొద్దు. ఆమెను ఏమీ చెయ్యం' అని వేడుకున్నారు. వాళ్లలో వచ్చిన మార్పుకు అందరూ సంతోషపడ్డారు శ్రీరాం అనుచరులు తప్ప. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని గ్రహించిన వారి నాయకుడు ముందుకొచ్చి 'ఇలాంటి బెదిరింపులకు లొంగొద్దు!' అంటూ తన అనుచరుల వైపు తిరిగి 'దాన్ని వేసేయండిరా!' అంటూ గట్టిగా అరిచాడు. దాంతో కాలనీ కుర్రాళ్ళు, చుట్టూ చేరిన జనం తిరగబడ్డారు. శ్రీరాం అనుచరులు తోకముడిచి, అక్కడి నుంచి జారుకున్నారు.


దీంతో పరిస్థితి సర్దుకుంది. శాస్త్రి గారి శిష్యులు, కత్తులు జారవిడిచి, చేతులు జోడించి, హనీకి ఏ హానీ తలపెట్టమని ముక్తకంఠంతో పలికారు. శాస్త్రి గారికి కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. ఎంతో ఉద్వేగానికి గురయ్యారాయన. వెంటనే హనీ ఆయన్ని పట్టుకొని, వల వలా ఏడ్చేసింది. కాస్సేపట్లో శాస్త్రి గారు తేరుకొని 'ఇది నా కోడలు కాదురా. కూతురికన్నా ఎక్కువ. మీలో చాలామందికి తెలియని విషయమొకటి ఉంది. ఈ తల్లే లేకపోతే, ఈ రోజు మీముందు నేనుండను. ఎప్పుడో చచ్చిపోవాల్సిన నన్ను, తన కిడ్నీ ఇచ్చి కాపాడింది. కిడ్నీ దానం చేయడానికి నా రక్త సంబంధీకులే ముందుకు రాలేదు. కిడ్నీ దానం చేసేటప్పుడు, నేను హిందువునా? ముస్లింనా? అని ఆలోచించలేదు నా పిచ్చి తల్లి. హిందువులమని, ముస్లింలమని తన్నుకు చస్తున్న మనం, మనమంతా భారతీయులమని అని మర్చిపోతున్నాం' అన్నారు. అంతా విన్నాక వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకొని, సిగ్గుతో తలవంచుకుని, క్షమించమని కాళ్ళ మీదపడ్డారు. శాస్త్రి గారికి గట్టినమ్మకం కలిగింది పరిస్థితి చక్కబడిందని. ఆయనకిప్పుడు ఎంతో హాయిగా ఉంది. పిల్లలు మళ్ళీ ట్రాక్‌ తప్పకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలా? అని ఆలోచిస్తూ, శిష్యబృందం వెంటరాగా ఇంటివైపు దారి పట్టారు.
                                             * కొయిలాడ రామ్మోహన్‌ రావు, 9849345060